ఓ వైపు నిపా వైరస్ కేరళలో భయపెడుతోంది. తాజాగా స్క్రబ్ టైఫస్ అనే మరో వ్యాధి ఒడిశాలో విజృంభిస్తోంది. రోజురోజుకూ ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వైద్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఒడిశాలో 180 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఒడిశా హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవ్వడంతో అధికారులు షాక్ అయ్యారు. కొత్త రకం వ్యాధితో ఒడిశా ప్రజలు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 180కి చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అందులో 10 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారని సుందర్‌గఢ్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కన్హు చరణ్ నాయక్ వెల్లడించారు. శనివారం 7 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవ్వడంతో ఆందోళన ఎక్కువైంది.
ఎవరికైనా 4 లేదా 5 రోజుల పాటు వరుసగా జ్వరం ఉంటే వారిని టెస్ట్ చేసుకోవాలని సర్కార్ కోరుతోంది. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకూ 7 మంది చనిపోయారు. అందుకే ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రజలకు టెస్టులు చేస్తూ ఆ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపడుతోంది. చెట్లలో ఉండే ఒక రకమైన లార్వా కుట్టడంతో శరీరంపై ఎస్చర్ అనే మచ్చ వస్తుందని, దానివల్ల ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.