NTR image on RS 100 coin: పురంధేశ్వరిని కలిసిన అధికారులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు. ఇందుకు సంబంధించిన నమూనాలపై సూచనలు, సలహాలు తీసుకోవడానికి మింట్ అధికారులు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు. ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వెండితో తయారు చేసిన రూ.100 నాణం మోడల్‌ను ఆమెకు చూపించారు. ఈ నమూనాకు ఆమె ఓకే చెప్పారు. అంతకుముందే నాణెం ఎలా ఉండాలి, ఏ చిత్రం ముద్రించాలనే విషయాన్ని ఆమె నుండి తెలుసుకున్నారని సమాచారం. త్వరలో ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం బయటకు రానుంది. మే 28, 2022వ తేదీ నుండి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం నేపథ్యంలో ఈ నాణేన్ని త్వరలో విడుదల చేసే అవకాశముంది. చారిత్రక ఘటనలు, ప్రముఖులకు గుర్తుగా నాణేలను విడుదల చేస్తారు. 1964 నుండి ఇలా నాణేలను విడుదల చేస్తున్నారు. తొలుత నెహ్రూ స్మారకార్థం నాణేలు విడుదల చేశారు. మాజీ ప్రధాని వాజపేయి చిత్రంతో కూడిన నాణేన్ని కూడా విడుదల చేశారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశా రాజకీయంగా ఉపయోగపడేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ నాణేన్ని తీసుకు వస్తోందనే వాదనలు ఉన్నాయి. ఏదేమైనా తెలుగు ప్రజల గౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌కు ఇది గౌరవమని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆర్బీఐ గతంలోనే ఈ తీపి కబురును అందించింది. చాలా కాలంగా ఉన్న కలను సాకారం చేసింది. ఎన్టీఆర్ చిత్రాన్ని వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ అంగీకరించినట్లు దాదాపు ఏడాది క్రితం పురంధేశ్వరి తిరుపతిలో తెలిపారు. వంద రూపాయల నాణెంపై తన తండ్రి బొమ్మ ముద్రించడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె, ఎన్టీఆర్‌కు భారతరత్న కూడా ఇవ్వాలని అప్పుడు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక కమిటీని నియమించారు.