టీడీపీ నేత నారా లోకేష్ రాజకీయాల్లో ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈ రోజు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లోకేష్ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఓ వైసీపీ నేత ఇంటికి వెళ్లారు.
మంగళగిరి నియోజకవర్గం వైసీపీ నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలను నారా లోకేష్ ట్వీట్ చేశారు. నారా లోకేష్ వెంట టీటీపీ నేతలు కూడా ఉన్నారు. ఓవైసీపీ నేత ఇంటికి ఆయన వెళ్లి వారితో మాట్లాడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా లోకేష్.. వైసీపీ పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్నారని లోకేష్ విమర్శించారు. సంక్షేమం గోరంత.. బాదుడే బాదుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత అన్నారు. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారని.. పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలన్నారు.