టైటిల్ : దసరా
నటీనటులు : న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, షమ్నా కాసిం, అనంత్ సింగ్, ఝూన్సీ
రచన & దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
డైలాగ్స్: తోట శ్రీనివాస్
కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్, ఈశ్వర్ పెంటి
ఇప్పటికే అనేక సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్న న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా నేడు(మార్చి 30న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా యాక్ట్ చేయగా, సముద్రఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, అనంత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. గతంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలంగాణ గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల గ్రామం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, కొన్ని సాంగ్స్ వైరల్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు బాషల్లో ఈ సినిమా తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఈ మూవీ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సినిమా మొత్తం గోదావరిఖనిలోని వీర్లపల్లె గ్రామంలో బొగ్గుగనుల మీద ఆధారపడిన ప్రజల జీవనం నేపథ్యంలో కొనసాగుతుంది. ధరణి (నాని), అతని స్నేహితుడు సూరి (దీక్షిత్ శెట్టి) సహా వారి ఫ్రెండ్స్ మద్యానికి బానిసలుగా మారిపోయి ప్రతి రోజు సేవిస్తూ ఉంటారు. వెన్నెల (కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచి వీరిద్దరికి కామన్ ఫ్రెండ్. ఆ క్రమంలో ధరణి వెన్నెలను ప్రేమించగా, వెన్నెల మాత్రం సూరిని ఇష్టపడుతుంది. శివన్న (సముద్రఖని) కుమారుడు చిన్న నంబి (షైన్ టామ్ చాకో) సర్పంచ్‌గా ఎన్నికైన క్రమంలో సిల్క్ బార్ బాధ్యతను తీసుకుంటాడు. ఆ క్రమంలో అక్కడి ప్రజలు ఎక్కువగా మద్యానికి అలవాటు పడి సిల్క్ బార్, మైనింగ్ నేపథ్యంలో జీవనం గడుపుతుంటారు. అదే నేపథ్యంలో ధరణి ఫ్రెండ్ సూరి ఆకస్మాత్తుగా హత్యకు గురవుతాడు. అయితే సూరిని ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? సూరిని చంపిన వారిని ధరణి ఏం చేశాడు? ఆ క్రమంలో వెన్నెల ధరణిని ప్రేమించిందా? ధరణి ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది అసలు స్టోరీ.
తెలంగాణలోని వీర్లపల్లిలో ఫ్లాష్ బ్యాక్ సీన్లతోపాటు తమ ప్రాంతంలో ఎప్పుడు బొగ్గు బాయిల మీద దద్దరిల్లే బాంబుల మోత కొనసాగుతుందనే డైలాగ్ తో సినిమా మొదలవుతుంది. ఈ ప్రాంత వాసులకు మద్యం అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమంలో 1995 ఎన్టీఆర్ ప్రభుత్వ హాయంలో మద్యాన్ని నిషేధిస్తారు. దీంతో అక్కడి ప్రాంత వాసులు మద్యం దుకాణాన్ని నిర్వహించే వారినే ప్రతి ఏటా సర్పంచ్ గా గెలిపిస్తారు. మరోవైపు ధరణి వెన్నెలను ప్రేమించగా..ఆమె మాత్రం ధరణి ఫ్రెండ్ సూరిని ఇష్టపడుతుంది. ఆ క్రమంలో ఫ్రెండ్ కోసం ధరణి తన ప్రేమను త్యాగం చేస్తాడు.
సింగరేణి బొగ్గును హీరో నాని తన ఫ్రెండ్స్ తో కలిసి దొంగిలించే సీన్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వీర్లపల్లిలో స్కిల్ బార్ విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. మరోవైపు మద్యం తాగి గొడవ పడుతూ మళ్ళీ మరుసటి రోజు వాటన్నిటిని మరిచిపోతూ ఉంటాడు. ఇలా ఓరోజు సంబి( షైన్ టామ్ చాకో ) స్కిల్ బార్ లో గొడవ పడి మరుసటి రోజు వాటన్నింటినీ మరిచిపోతాడు. కానీ ఈ విషయాన్ని సంభీ మాత్రం సీరియస్ గా తీసుకుంటాడు. అయితే ధరణి చేసిన పొరపాటు వల్ల వెన్నెల, అతని స్నేహితుల జీవితాలలో అనేక ఇబ్బందులు నెలకొంటాయి. వారికోసం ధరణి ఏం చేశాడు అన్నదే ఈ మూవీ కథ. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. తోట శ్రీనివాస్ డైలాగ్స్ సినిమా అంతటా హైప్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ మరో లెవల్లో ఉంటుంది.
ఈ చిత్రంలో హీరో నాని యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తెలంగాణ యాసతో అద్భుతంగా నటించాడు. అతను తన భావోద్వేగాలను చిత్రీకరించిన విధానం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది. దీంతోపాటు అతను చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఇంటెన్స్‌గా ఉన్నాయి. సహజంగా ఉండే ఈ పాత్రకు వెన్నెలగా కీర్తి సురేష్ కరెక్టుగా సూట్ అయింది. ఆమె డి-గ్లామ్ పాత్రను పోషించడంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా యాక్ట్ చేసింది. ఈమె నటన, డైలాగ్స్ చాలా సహజంగా ఉన్నాయి. ధీక్షిత్ శెట్టి మిగతా ఇద్దరు లీడ్స్ పాత్రల కంటే తక్కువేం కాదన్నట్లు సహజంగా నటించి మెప్పించాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకు మంచి పాత్ర లభించింది. అతను ఆకట్టుకునే నటనతో మెప్పించాడు. సాయికుమార్, సముద్రఖని, పూర్ణ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.
శ్రీకాంత్ ఓదెల మాస్ ఆడియన్స్‌ని మాత్రమే అలరించేలా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఓ మాములు రోటిన్ స్టోరీతో సినిమాను తెరకెక్కించాడని చెప్పవచ్చు. కానీ రచయితగా కంటే దర్శకుడిగానే ఆయన గొప్పతనం కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో కొత్తగా స్టోరీ లేకపోవడంతో పలువురు అభిమానులు నిరాశకు గురయ్యారని చెప్పవచ్చు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాలోని అనేక సన్నివేశాలకు ఉర్రూతలూగించే ఉత్తమ సంగీతాన్ని అందించారు. సత్యన్ సూర్యన్ తన పనితనంలో అద్భుతం. అతని కెమెరావర్క్, ముఖ్యంగా రాత్రి సన్నివేశాలలో, చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. ఎడిటర్ నవీన్ నూలి సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను ట్రిమ్ చేసి దసరాను ఆకర్షణీయంగా మార్చారని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్, సత్యన్ సూర్యన్ కెమెరా పనితనం, రియల్ సతీష్, అన్బరివ్ స్టంట్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి.
నాని యాక్టింగ్
యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్స్
కొన్ని సాంగ్స్
కెమెరా వర్క్
రోటిన్ స్టోరీ
కామెడీ లేదు
కొన్ని సీన్లను అంచనా వేయడం