»Movement In Apjac From March 9th On Many Issues Including Prc
APJAC: పీఆర్సీతోపాటు పలు అంశాలపై రేపటి నుంచి ఏపీలో ఉద్యమం
ఏపీలో పీఆర్సీతో(PRC)పాటు పలు అంశాల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా APJAC నిరసనలు చేపట్టనుంది. సీఎం జగన్(CM JAGAN) ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈరోజు మూడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ప్రభుత్వం అత్యవసరంగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో చర్చలు సఫలం అవుతాయే లేదో చూడాలి.
ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్(cm jagan) ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని APJAC ఆరోపించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (APJAC అమరావతి) మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆందోళన చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఈహెచ్ఎస్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ నిర్ధారణ వంటి సమస్యలు ఉన్నాయని జేఏసీ నాయకులు అసోసియేషన్ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతోపాటు జీపీఎఫ్(GPF), ఏపీజీఎల్ఐ, సెలవు తదితర పెండింగ్ బిల్లులు కూడా ఉన్నట్లు గుర్తు చేశారు.
2022 ఏప్రిల్ నుంచి దశలవారీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని మంత్రుల కమిటీ తెలిపింది. కానీ ఏడాది గడిచినా, ఏ ఒక్కటీ అంగీకరించలేదని APJAC వెల్లడించింది. దీంతోపాటు జీఓఎం(GOM) సమావేశంలో సైతం ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వివిధ వేదికలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సానుకూల స్పందన రాలేదన్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వ వైఖరితో ఆందోళనకు గురై ఫిబ్రవరి 5న కర్నూలులో జరిగిన ఏపీ జేఏసీ(AP JAC) సర్వసభ్య సమావేశంలో ఫిబ్రవరి 26లోగా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనకు దిగాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అన్ని సమస్యలను చీఫ్ సెక్రటరీకి నివేదించారు. ఫిబ్రవరి 13న వాటిపై వివరంగా చర్చించారు. సానుకూల స్పందన రాకపోవడంతో ఫిబ్రవరి 26న జేఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిన మేరకు తాము ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు రేపటి నుంచి ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం(ap government) మూడు ఉద్యోగ సంఘాలతో ఇవాళ అత్యవసరంగా చర్చలు జరపుతోంది. ప్రతి సంఘం నుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులు రావాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఓసారి మంత్రి బొత్స నివాసంలో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రాలేదు.