Mohamed Nasheed Apologies India : మల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్(Mohamed Nasheed) భారత్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మాల్దీవులు, భారత్ మధ్య ఇటీవల తలెత్తిన వివాదం వల్ల తమ దేశంపై ఎంతో ప్రభావం పడిందన్నారు. అందువల్ల తమ దేశ పర్యాటక రంగం బాగా దెబ్బ తిందని వెల్లడించారు. వేసవి సెలవుల్లో భారతీయులు తప్పకుండా తమ దేశానికి రావాలని కోరుకుంటున్నామన్నారు. తమ ఆతిథ్యం ఎప్పటిలాగే ఉంటుందని అందులో ఎలాంటి మార్పూ ఉండబోదని వెల్లడించారు.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మహ్మద్ నషీద్ రెండు దేశాల మధ్య ఉన్న దౌత్య వివాదంపై మాట్లాడారు. ఈ వివాదం వల్ల బాయ్‌కాట్ మాల్దీవుస్ టూరిజం అంటూ సోషల్ మీడియాలో మన దేశంలో పెద్ద ప్రచారమే నడిచింది. ఈ ప్రభావం మాల్దీవుల పర్యాటకంపై పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత దళాలు మాల్దీవుల్ని(Maldives) విడిచి వెళ్లాలని తమ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కోరినప్పుడు భారత్ ఎంతో బాధ్యతా యుతంగా వ్యవహరించిందని అన్నారు.
భారత్(India) ఎప్పుడూ తన బలాన్ని ప్రదర్శించాలని అనుకోలేదని తెలిపారు. అయితే మయిజ్జు అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారన్నారు. చైనా నుంచి రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్‌లను ఆయన కొనుగోలు చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. అవి అవసరం అని ప్రస్తుత మాల్దీవ్స్ ప్రభుత్వం అనుకోవడం దురదృష్ణకరమని ఆయన అభిప్రాయపడ్డారు.