ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (K. Kavitha) మండిపడ్డారు. రైతులకు అందించే పీఎం కిసాన్ సహాయ నిధిపై మోడీ (Narendra Modi) అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. 11 కోట్ల మంది రైతులకు నగదు సహాయం ఇస్తున్నట్లు చెప్పారని, కానీ కేంద్రం 3.87 కోట్ల మంది రైతులకే నగదు సాయం అందిస్తోందన్నారు. ప్రతి సంవత్సరం నగదు సాయం లబ్ధి పొందే రైతుల సంఖ్యను కేంద్రం కుదిస్తూ వస్తోందని విమర్శించారు. ప్రధాని మోడీ జాతీయవాదం ముసుగులో దాక్కున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. పార్లమెంటులో అంతసేపు మాట్లాడిన ప్రధాని… అదానీ (Adani) వ్యవహారంపై మాట్లాడలేదన్నారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించి, విచారణ జరిపించాలని భారత్ రాష్ట్ర సమితి(BRS) డిమాండ్ చేస్తుందన్నారు. అదానీ (Adani)సంస్థల్లో ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టిందని గుర్తు చేశారు. అదానీ వ్యవహారంపై వస్తోన్న విమర్శలకు ప్రధాని జవాబు ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
అంతకుముందు, అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు (Harish Rao) కూడా ప్రధాని మోడీపై (narendra modi) ధ్వజమెత్తారు. బీజేపీ (bjp) ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి, అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని ఎద్దేవా చేశారు. చిట్టచివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ సిద్దాంతమని, కానీ బీజేపీ వాళ్లకు పేద ప్రజల సంక్షేమం వద్దు… కార్పొరేట్లకు దోచిపెట్టుడే ముద్దు అన్నచందంగా మారిందన్నారు. దేశంలోని పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. చివరకు పారాసిటామల్ మెడిసిన్ ధరను కూడా మోడీ ప్రభుత్వం 10 శాతం పెంచిందన్నారు. కరోనా తర్వాత పారాసిటామల్ వాడకం ఎక్కువైందని, ఇదే అదునుగా భావించిన కేంద్రం ఆ మెడిసిన్ ధరను పెంచిందన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఒక్క పారాసిటామల్ మెడిసిన్ ధరలే కాదు.. 898 మెడిసిన్ల రేట్లు పది శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు.
భారతదేశ చరిత్రలో ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో అత్యవసర మందుల ధరలు పెంచిన దుర్మార్గ చరిత్ర ఇంకెవరికీ లేదన్నారు. ఆ ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం చర్యలు చెప్పుకుంటే, గుండె అవిసిపోతుందన్నారు. కానీ, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతలు చూస్తే అవార్డులు, పురస్కారాల లిస్ట్‌ను అసెంబ్లీలో ఒక సెషన్ అంతా చెప్పవచ్చునన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గతంలో బడ్జెట్లను ప్రవేశపెట్టే సమయంలో ఒక దశ దిశ ఉండేదని, ఆర్థిక సర్వేలకు దగ్గరగా కేంద్ర బడ్జెట్ ఉండేదన్నారు. అందుకు తగినట్టు దేశ ప్రగతి కూడా ఉండేదన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో బడ్జెట్లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అన్నారు. మోడీ మొదటి బడ్జెట్లో చెప్పింది… సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. కానీ అలా జరగడం లేదన్నారు. రెండో బడ్జెట్లో నల్లధనాన్ని అరికడతామని చెప్పి, మరుసటి ఏడాది పెద్ద నోట్లను రద్దు చేశారని దుయ్యబట్టారు. దీంతో ఆర్థిక వ్యవస్థ చితికి పోయిందన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం తెస్తామన్న మోడీ, ప్రజలు జన్‌ధన్ ఖాతాలు తెరిచి ఎదురు చూసే పరిస్థితి తెచ్చారన్నారు. మూడో బడ్జెట్లో రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారని, కానీ రైతులను పట్టించుకోకుండా, 2020లో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారన్నారు. జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్ అయిందని విమర్శించారు.