»Japanese Woman Tourist Harassed On Holi Has Left India Went To Bangladesh
Holi రోజు ఘోర అవమానం.. భారత్ ను విడిచిన జపాన్ టూరిస్ట్
దేశ రాజధానిలో పర్యాటకుల దక్కే గౌరవం, మర్యాద ఇదా? అని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతిథిదేవో భవ అని గౌరవించే మన దేశంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని పేర్కొన్నాయి.
భారతదేశం (India)లో హోలీ (Holi) వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా ప్రజలు రంగుల్లో మునిగి తేలారు. అయితే హోలీని అడ్డం పెట్టుకుని కొందరు ఆకతాయిలు, దుండగులు పలుచోట్ల దారుణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా ఓ జాతీయ పార్టీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంస్థల వాళ్లు హోలీ వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భారతదేశ పర్యటనకు వచ్చిన జపాన్ (Japan Tourist) దేశస్తురాలిపై అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై గుడ్ల (Eggs)తో దాడి చేసి రంగులు (Colours) బలవంతంగా పూశారు. ఆమెను కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటన అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నది. కాగా ఈ ఘటనతో ఆ యువతి భారత్ ను వదిలేసి బంగ్లాదేశ్ పారిపోయింది. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈనెల 7వ తేదీన హోలీ పండుగ జరిగిన విషయం తెలిసిందే. ఆ రోజు ఢిల్లీ (New Delhi)లోని పహార్ గంజ్ (PaharGanj) ప్రాంతంలో కొందరు యువకులు (YoungBoys) హోలీ ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో భారత్ సందర్శనకు వచ్చిన జపాన్ యువతిని ఆ యువకులు చుట్టుముట్టారు. ఆమెను గట్టిగా పట్టుకుని బలవంతంగా ఆమెపై రంగులతో దాడి చేశారు. అంతటితో ఊరుకోకుండా ఆమెపై కోడిగుడ్లు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని వెళ్తుండగా మరో యువకుడు వస్తుండగా అతడిని కొట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ యువకుల తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు.
ఆమెపై దాడి చేసిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ కేసుపు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆ యువతి ఈ భయంతో భారత్ ను వదిలేసి బంగ్లాదేశ్ కు వెళ్లిపోయింది. ‘నేను క్షేమంగానే ఉన్నా. ఈ విషయం ఇంత తీవ్రంగా మారుతుందని ఊహించలేదు’ అని ఆ యువతి బంగ్లాదేశ్ నుంచి ట్వీట్ చేసింది. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్ స్పందించారు. జపాన్ యువతిపై దాడికి పాల్పడిన యువకుల వీడియోను పరిశీలించారు. ఆ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. కాగా దేశ రాజధానిలో పర్యాటకుల దక్కే గౌరవం, మర్యాద ఇదా? అని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతిథిదేవో భవ అని గౌరవించే మన దేశంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని పేర్కొన్నాయి.