SARABJIT SINGH KHALSA : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బీయాంగ్ సింగ్ కుమారుడు సరబ్జీత్సింగ్ ఖల్సా (45) లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. పంజాబ్లోని ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంటర్ డ్రాపౌట్ అయిన ఆయన 2014లో ఫతేగఢ్ సాహిబ్ (రిజర్వుడు) స్థానం నుంచి, 2019లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా బటిండా నుంచి పోటీచేసి రెండుసార్లూ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సరబ్జీత్సింగ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులను రూ. 3.5 కోట్లుగా పేర్కొన్నారు.
సరబ్జీత్ సింగ్ ఖల్సా తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి 4లక్షల ఓట్ల మెజరిటీతో గెలిచారు. అవే ఎన్నికల్లో ఆయన తాత, బియాంత్ సింగ్ తండ్రి సుచాసింగ్ కూడా బఠిండా స్థానం నుంచి విజయం సాధించారు. 3 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తుపాకులతో కాల్చడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా, వీరు ఇందిరాగాంధీకి భద్రతా సిబ్బందిగా విధులు నిర్వర్తించేవారు.