టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో పోటీపడుతోంది. ఇప్పటికే ఒక మ్యాచ్ ఆసిస్ గెలవగా… రెండో మ్యాచ్ … భారత్ గెలిచింది. ముచ్చటగా మూడో మ్యాచ్… హైదరాబాద్ లో జరగనుంది. ఈ టికెట్ల కోసం.. ఇటీవల జనాలు కొట్టుకున్నారు. తొక్కిసలాట కూడా జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే… రేపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తున్నారు. ఈ నేపధ్యంలో క్రికెట్ అభిమానులకు మెట్రో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చినవారికి వీలుగా రేపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు స్పెషల్ మెట్రో రైలు సర్వీసులు నడవనున్నాయి.
అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ స్పెషల్ సర్వీసులు కేవలం స్టేడియం స్టేషన్ నుంచే ఉంటాయి. ఇక అమీర్‌పేట్, జేబీఎస్ స్టేషన్ల నుంచి కనెక్షన్ ట్రైన్ సర్వీస్‌లు అందుబాటులో ఉండనున్నాయి. అటు ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో ఉప్పల్, స్టేడియం, NGRI మెట్రో స్టేషన్లలో మాత్రమే ఎంట్రీ గేట్స్ తెరిచి ఉంటాయని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.
అలాగే దిగబోయే ప్రయాణీకుల కోసం మిగతా స్టేషన్లలో ఎగ్జిట్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటాయని తెలిపారు. కాగా, మెట్రో స్టేషన్లలో రాత్రి 10 గంటల వరకే టికెట్ కౌంటర్లు తెరిచి ఉంటాయని.. రిటర్న్ టికెట్లు కొనుగోలు చేసేవారు రాత్రి 10 గంటలలోపు తీసుకోవాలని సూచించారు. అటు రాత్రి 10.15 గంటల తర్వాత నుంచి డిజిటల్ టికెట్స్ కొనుగోలుకు ఛాన్స్ ఉండదని పేర్కొన్నారు.
క్రికెట్ ఫ్యాన్స్‌కు టీఎస్ఆర్టీసీ కూడా గుడ్‌న్యూస్ అందించింది. సెప్టెంబర్ 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపధ్యంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం సిటీ బస్సు సర్వీసులను పొడిగించింది. ఉప్పల్ స్టేడియం నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ మేనేజర్ సీహెచ్ వెంకన్న వెల్లడించారు. మేడ్చల్, హకీంపేట్, సికింద్రాబాద్, జేబీఎస్, జీడిమెట్ల, ఘట్కేసర్, కోఠి, మోహిదీపట్నం, పటాన్చెరు వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ప్రయాణీకులు దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ పేర్కొంది.