కేంద్ర ప్రభుత్వంపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. మతోన్మాదం, దేశాన్ని సర్వనాశనం చేయడం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం.. రాజ్యాంగానికి తూట్లు పొడవడం వంటివి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు. మోదీని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. లౌకిక శక్తులు, పార్టీలన్ని కలిసి రావాలని పిలుపునిచ్చారు. మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో సీపీఐ (Communist Party of India -CPI), సీపీఐ (ఎం) పార్టీలు (Communist Party of India -Marxist) గర్జించాయి.
హైదరాబాద్ (Hyderabad)లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఇరు పార్టీలు ఉమ్మడి సమావేశం నిర్వహించాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర నాయకుల వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించాయి. దీనికి కలిసి వచ్చే పార్టీలతో జత కడుతామని ప్రకటించారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో కలిసి పని చేయాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. అనంతరం సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury), సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా (D Raja) మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తోంది’ అంటూ మండిపడ్డారు. ‘రాజ్యాంగాన్ని.. ఈడీ, సీబీఐ సంస్థల్ని మోదీ దుర్వినియోగం చేస్తున్నాడు’ సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. వందేభారత్ రైలుపై మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘భాగ్యలక్ష్మి ఆలయ నగరం నుంచి వేంకటేశ్వరస్వామి నగరానికి వందేభారత్ రైలు వెళ్తోందని మోదీ చెప్పి రైలుకు కూడా మతం రంగు పులుముతారా?’ అని సీపీఐ(ఎం) పోలిటిబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు నిలదీశారు. ‘మోదీ దేశాన్ని అమ్మేస్తారు. సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్లను ప్రైవేటుకు అప్పగించేస్తారు’ అని తెలిపారు.
ఏపీ సీఎం జగన్ (YS Jagan) పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ (K Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ పై ఆర్థిక దోపిడీ సహా అనేక కేసులు ఉన్నాయి. హత్య ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రధాని మోదీకి జగన్ మద్దతు ఇస్తూ జైలుకు వెళ్లకుండా ఉన్నాడు. కేసీఆర్ మోదీని వ్యతిరేకిస్తున్నందుకే కవితను జైలుకు పంపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నాడు’ అని నారాయణ దుమ్ముధులిపారు. ప్రధాని సభకు సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao) వెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.