ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజులు వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు.. అంటే 18వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి 18వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఢిల్లీతోపాటు అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) తెలిపింది. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం చెప్పింది. తూర్పు భారతదేశం, మధ్య భారతదేశంలో కూడా రాబోయే 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 17న ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అధికారులు అన్నారు. అలాగే కర్ణాటకలో 18, 19 తేదీల వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతోంది.
మరోవైపు ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వరదలకు(floods) 150 మందికి పైగా మరణించారు. హిమాచల్ ప్రదేశ్ లో మెరుపు వరదలు, భారీ వర్షాల కారణంగా రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రోడ్లు, అనేక వంతెనలు దెబ్బతిన్నాయని, చాలా చోట్ల వంతెనలు, ఇళ్లు కూలిపోయాయని అన్నారు. ఆ నేపథ్యంలో 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందని వివరించారు.