కరోనా మహమ్మారి భయం కారణంగా ఓ మహిళ ఏకంగా మూడేళ్లుగా ఇంట్లో నుండి బయటకు రాని సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో (New Delhi) గురుగ్రామ్ (Gurugram) చక్కార్ పూర్ లో వెలుగు చూసింది.
మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి (covid 19) ప్రపంచాన్ని, ప్రజల జీవితాన్ని ఎంతో మార్చింది. ఒకరిని ఒకరు తాకకపోవడం, ఆమడ దూరంలో ఉండటం, మాస్కులు ధరించడం, లాక్ డౌన్ (Lock Down) సహా ఇలా ఎన్నో ఇబ్బందులు కలిగాయి. కరోనా (Covid 19) ప్రభావం ఇప్పటికీ పూర్తిగా తగ్గిందని చెప్పలేని పరిస్థితి. చైనాలో (China) ఇటీవలి వరకు రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదైన వార్తలు మనం విన్నాం. కరోనా భయంతో ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడే పరిస్థితి. భారత్ లో (India) కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోయింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పుడు దేశంలో కరోనా ముందునాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ మహమ్మారి భయం కారణంగా ఓ మహిళ ఏకంగా మూడేళ్లుగా ఇంట్లో నుండి బయటకు రాని సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో (New Delhi) గురుగ్రామ్ (Gurugram) చక్కార్ పూర్ లో వెలుగు చూసింది.
కరోనా భయంతో సదరు మహిళ తన పదేళ్ల కొడుకుతో కలిసి దాదాపు మూడేళ్లుగా ఇంటికే పరిమితమైంది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వకుండా లోపలి నుండి తాళం వేసుకున్నది. ఓ ప్రయివేటు కంపెనీలో ఇంజినీర్ గా పని చేస్తున్న సుజన్ మాఝీ తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం తొలిసారి లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత సుజన్ ఉద్యోగానికి వెళ్లాడు. కానీ ఆనాటి నుండి సుజన్ భార్య మున్మున్ స్వీయ నిర్బంధంలో ఉంటోంది. తలుపు తీయాలని భర్త ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆమె పట్టించుకోలేదు. కరోనా భయంతో కొడుకుతో పాటు లోపలనే ఉండిపోయింది. దీంతో సుజన్ చేసేదేం లేక సమీపంలోనే మరో ఇంటిలో నివాసం ఉంటున్నాడు. నిత్యావసర వస్తువులు ప్రతి రోజు తీసుకు వచ్చి తలుపు వద్ద ఉంచుతున్నాడు. భర్త అక్కడి నుండి వెళ్లాక ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకొని, వాటిని తీసుకునేది. భార్యాభర్తలు ఇద్దరు కేవలం వీడియో కాల్ లో మాత్రమే మాట్లాడుకుంటున్నారు.
మూడేళ్లు గడిచినా భార్య తలుపు తీయకపోవడంతో భర్త సుజన్ పోలీసులను సంప్రదించాడు. మంగళవారం చక్కార్ పూర్ పోలీసులుతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంటుకు చెందిన అధికారులు అక్కడకు వచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి, మున్మున్ మాఝీ, పదేళ్ల కొడుకును బయటకు తీసుకు వచ్చారు. ఇంటి లోపల ఆందోళన పరిచే విజువల్స్ కనిపించాయి. చుట్టూ పేరుకుపోయిన బట్టలు, వెంట్రుకలు, చెత్త, దూళి, కిరాణా సామాగ్రి కుప్పగా కనిపించింది.
తన కుమారుడికి ఇంట్లోనే ఆ తల్లి జుత్తు కత్తిరించినట్లుగా అక్కడ కనిపించింది. ఇంట్లో గ్యాస్ స్టౌవ్ కు బదులు ఇండక్షన్ ద్వారా వంట చేసింది. మూడేళ్లుగా ఇంట్లోని చెత్తా చెదారం బయటకు తీయకపోవడంతో డస్ట్ బిన్ లా ఉంది. అటు వైపు ఎవరూ వెళ్లలేదు. మూడేళ్లుగా ఇంట్లో ఉన్న పిల్లవాడు గోడలపై పెయింట్స్ వేశాడు. ఈ మూడేళ్లుగా కనీసం సూర్యుడిని కూడా చూడలేదు. వారిద్దరు ఇంటికే పరిమితమైనట్లు చుట్టు పక్కల వారికి కూడా అంతగా తెలియదు. కరోనా కారణంగా తన కొడుకు చనిపోతాయని ఆ మహిళ ఆందోళన చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. తన భర్త ఉద్యోగానికి వెళ్తున్నందున కనీసం అతనిని కూడా ఇంట్లోకి అనుమతించలేదు.