MBBS విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నీట్ పీజీ మెడికల్ కోర్సుల కోసం స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) ఇంటర్న్షిప్ కట్-ఆఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగించింది. దీంతో ఐదు రాష్ట్రాల నుంచి అదనంగా 13,000 MBBS విద్యార్థులు 2023 పరీక్షకు అర్హత సాధించారు. మొదట ప్రకటించిన ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ తేదీ మార్చి 31, తర్వాత జనవరిలో జూన్ 30కి పొడిగించింది. ఆయా రాష్ట్రాల నుంచి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గ్రాడ్యుయేషన్ కోసం ఫైనల్స్ తర్వాత, పోస్ట్-గ్రాడ్యుయేషన్కు అర్హత సాధించడానికి ముందు వైద్య విద్యార్థులందరూ ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేయడం తప్పనిసరి. మార్చి చివరి నాటికి ఈ ఇంటర్న్షిప్ను పూర్తి చేయడానికి ప్రారంభ కటాఫ్ తేదీ అంటే ప్రస్తుత బ్యాచ్ దరఖాస్తుదారుల నుంచి దాదాపు సగం మంది విద్యార్థులు అనర్హులుగా మారిపోతారు. దీనికి తోడు మహమ్మారి ఫలితంగా గత మూడు సంవత్సరాలుగా మెడికల్ అకడమిక్ క్యాలెండర్ ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంతో అనేక మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట లభించనుంది.
ఈ అభ్యర్థులు నీట్ పీజీ కోసం ఫిబ్రవరి 12 నుంచి అప్లై చేసుకోవచ్చని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఎగ్జామ్ మార్చి 5న నిర్వహించనున్నారు. మరోవైపు ఎండీఎస్ నీట్ ఎగ్జామ్ రాసేందుకు వీలుగా బీడీఎస్ విద్యార్థుల ఇంటర్న్ షిప్ కటాఫ్ తేదీని కూడా జూన్ 30 వరకు పెంచారు. ఈ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి ఆదివారం(ఫిబ్రవరి 12) అర్ధరాత్రి వరకు అప్లై చేసుకోవాలని సూచించారు.