NEET PG 2023 కట్-ఆఫ్ పర్సంటైల్‌ను తగ్గించాలనే వైద్యుల సంఘాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, మిగిలిన రౌండ్ల కౌన్సెలింగ్‌కు ప్రతి ఒక్కరినీ అర్హులుగా చేసింది. ఈ క్రమంలో కట్-ఆఫ్ పర్సంటైల్ ని అన్ని వర్గాలకు సున్నాకి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
NEET PG 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు అర్హులని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) స్పష్టం చేసింది. నీట్ పీజీ కట్ ఆఫ్ పర్సంటైల్‌ను తగ్గించాలనే అభ్యర్థనను కేటగిరీల వారీగా సున్నాకి తగ్గించింది. దీంతో ప్రతి ఒక్కరూ ఇప్పుడు మిగిలిన రౌండ్ల కౌన్సెలింగ్‌కు అర్హులుగా మారారు. పర్సంటైల్ తగ్గింపు తర్వాత అర్హత పొందిన అభ్యర్థులు PG కౌన్సెలింగ్ 3వ రౌండ్ కోసం కొత్తగా అప్లై చేసుకోనున్నారు. అయితే ఇప్పటికే అప్లై చేసిన వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎంసీసీ(MCC) పేర్కొంది. ఈ క్రమంలో ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పీజీ కోర్సుల్లో చేరేందుకు అనేక మంది విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో పారా క్లినిక్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ సహా పలు కోర్సుల్లో దేశవ్యాప్తంగా మూడో రౌండో కౌన్సిలింగ్ కోసం 13 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పీజీ కౌన్సెలింగ్ కోసం రౌండ్-3 కోసం తాజా షెడ్యూల్ త్వరలో MCC వెబ్సైట్లో ఉంచబడుతుంది. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఈ విషయాన్ని పరిశీలించాలని కోరిన కొద్ది రోజుల తర్వాత కట్-ఆఫ్ స్కోర్‌లో తగ్గింపు వచ్చింది. గత సంవత్సరాల్లో NEET-PG కోసం అనేక రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత కూడా దేశవ్యాప్తంగా వైద్య సంస్థలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ అంశం సవాలుగా మారింది. కట్-ఆఫ్‌ను తగ్గించడం ద్వారా ఈ ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ఎక్కువ సంఖ్యలో అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పించబడుతుంది. NEET-PG 2023 కట్-ఆఫ్ పర్సంటైల్‌ను 30 శాతం వరకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది. తద్వారా క్లినికల్, నాన్-క్లినికల్ బ్రాంచ్‌లలో చాలా సీట్లను భర్తీ చేయవచ్చని సూచించారు.