ఫిబ్రవరి 5న ప్రారంభమైన దూరాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. లింగమతుల స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో జాతర మొత్తం జనాలతో కోలాహలంగా మారింది. సోమవారం ఈ గొల్లగట్టు జాతరకు మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ సహా పలువురు హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు.
జాతరలో భాగంగా మంగళవారం(మూడో రోజు) చంద్రపట్నం వేసి లింగమతుల స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఐదు రోజు జరిగే ఊరేగింపుతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. మరోవైపు భక్తుల రాక సందర్భంగా కంట్రోల్ రూం సహా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో రెండేళ్లకోసారి జరిగే రెండో పెద్దదైన పెద్దగట్టు జాతర నిర్వహణ కోసం ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించింది.