రైతులకు కనీస మద్దతు ధర కన్నా… పైసా కూడా తగ్గడానికి వీలు లేదని.. వారికి సరైన రేటు రావాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీలో ఖరీప్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలనేఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. చిన్న సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో ముందుగానే గోనెసంచులు సిద్ధం చేయాలన్నారు. రవాణా, కూలీ ఖర్చుల రీయింబర్స్లో జవాబుదారీతనం ఉండాలని.. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలని కోరారు. రవాణా, సంచుల ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోందని రైతులకు వివరంగా చెప్పాలని సీఎం జగన్ అన్నారు. చేయాల్సిన ధాన్యం సేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు ముందస్తుగానే గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలి. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.
రైతులకు చేసే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కార్పొరేషన్ నుంచి డీబీటీ పద్ధతిలో డబ్బు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. డీబీటీ పద్ధతితో చెల్లింపుల ద్వారా పారదర్శకత తీసుకురావచ్చని.. అవకతవకలు, అవినీతికి ఆస్కారం లేకుండా ఎస్వోపీలు ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపైనా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ తెలిపారు.