స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. మదుపర్ల సంపద కన్నా మోదీకి తన స్నేహితుడు గౌతమ్ అదానీ స్నేహం ఎక్కువ అని నిలదీస్తున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పున:ప్రారంభమైన పరిస్థితిలో మార్పు రాలేదు. గత నెల వాయిదా పడిన సమావేశాలు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. గతనెల బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదానీ కుంభకోణంపై విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉభయసభల్లో ఆందోళనలు చేపట్టాయి. సభలో చర్చ జరగాలని పట్టుపట్టడంతో చర్చలు కొనసాగకుండానే సభలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా పున:ప్రారంభమైన సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీల సభ్యులు అదానీ కుంభకోణంపై విచారణ చేపట్టాలని కోరుతూ ఆందోళనలు కొనసాగించాయి. దీనికితోడు ప్రతిపక్ష పార్టీలపై విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. రాజ్య సభ, లోక్ సభలో ఆందోళనలు కొనసాగాయి.
స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. మదుపర్ల సంపద కన్నా మోదీకి తన స్నేహితుడు గౌతమ్ అదానీ స్నేహం ఎక్కువ అని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశాయి. దీంతో లోక్ సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ అదే పరిస్థితి ఉండడంతో చైర్మన్ ధన్ కర్ రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
సభ వాయిదా పడడంతో ఇరు పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐని ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరారు. నరేంద్ర మోదీ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు, వెంకటేశ్ నేత, వద్దిరాజు, సంతోశ్ కుమార్, రంజిత్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.
సభలు వాయిదా పడిన అనంతరం 16 పార్టీల సభ్యులు సమావేశమయ్యారు. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి డీఎంకే, జేడీయూ, ఆప్, సీపీఐ (ఎం), సీపీఐ, కేరళ కాంగ్రెస్, ఆర్ఎల్డీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంల్, శివసేన (ఉద్దవ్), ఎండీఎంకే, ఆర్ఎస్పీ, ఆర్జేడీ, జేఎంఎం పార్టీలు హాజరయ్యాయి.