Floods: దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) అనేక డ్యామ్లు నిండిపోయాయి. రాష్ట్రంలో అనేక చెరువులు తెగిపోయాయి. తాజాగా వరంగల్ (Warangal) భద్రకాళి చెరువుకు(Bhadrakali Pond) గండి పడింది. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో పాటు పైనుంచి వరద రావడంతో పోతన నగర్ వైపుగా ఉన్న కట్ట బలహీన పడి గండి పడింది. 10 నుంచి 15 మీటర్ల మేర కట్ట తెగటంతో వరద నీరు అంతా సమీపంలో ఉన్న పోతనగర్, రాజీవ్ కాలనీ, సరస్వతి కాలనీకు చేరింది. గండి పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు దిగువన ఉన్న కాలనీ వాసులను అప్రమత్తం చేశారు.
నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున కాలనీ వాసులను ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. చెరువుకు వరద ప్రవాహం లేనందున ప్రస్తుతానికి కట్టకు ప్రమాదమైతే లేదని ముందస్తు చర్యల్లో భాగంగా కాలనీ వాసులను అప్రమత్తం చేసినట్లు వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. చెరువుకు గండి పడటంతో కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తున్నందుకు బాధ పడుతున్నారు. చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. గండిని పూడ్చేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ యంత్రాంగం వరద నివారణకు ఇసుక బస్తాలను సేకరించి పనులను ప్రారంభించింది.