ఏపీ(AP)లో రోజురోజుకూ ఎండల తీవ్రత ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో వడగాల్పుల(Heatwaves) తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఉక్కపోతలను తట్టుకోలేకపోతున్నారు. ఇండియా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల వల్ల చాలా మంది వడదెబ్బకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. పెద్దలే భరించలేకపోతున్న ఈ ఎండ తీవ్రతకు పిల్లలు కూడా విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేది వరకూ ఏపీలో ఒంటిపూటబడులను పొడిగిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. వేసవి సెలవులు(Summer Holidays) ముగిసినప్పటికీ ఎండల తీవ్రత ఇంకా అలానే ఉంది. అందుకే ఏపీ సర్కార్ ఒంటిపూట బడులను నిర్వహిస్తూ వస్తోంది.
రేపటి నుంచి ఏపీ పాఠశాలల్లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ మాత్రమే టీచర్లు తమ విద్యార్థులకు పాఠాలు బోధించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకూ పాఠశాలల్లో రాగి జావను పంపిణీ చేయాలని, చివరగా ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకూ మధ్యాహ్న భోజనం పెట్టాలని ఏపీ విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది.