»Ap Capital Kotamreddy Sridhar Reddy Supported To Amaravati Farmers Movement
Amaravati నుంచి ఒక్క ఇటుక కూడా తీయలేరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
అమరావతి రాజధాని అంటే 29 గ్రామాలకు సంబంధించినది కాదు. ప్రపంచంలో ఉన్న కోట్లాది తెలుగు ప్రజలందరిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడు ఎందుకు కాదో సీఎం జగన్ చెప్పాలి
మూడు రాజధానుల (Three Capitals)కు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతుల పోరాటానికి (Amaravati Farmers Movement) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) మద్దతు పలికారు. ‘అమరావతి నుంచి ఒక్క ఇటుక కూడా తీసుకెళ్లలేరు’ అని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి తాను సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
అమరావతి (Amaravati)ని రాజధానిగా కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు (Farmers) సాగిస్తున్న పోరాటం గురువారానికి 1200 రోజులు పూర్తయ్యింది. దీంతో మందడంలో (Mandadam) రాజధాని రైతులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కోటంరెడ్డి రైతులకు మద్దతు ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ‘అమరావతి రాజధాని అంటే 29 గ్రామాలకు సంబంధించినది కాదు. ప్రపంచంలో ఉన్న కోట్లాది తెలుగు ప్రజలందరిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడు ఎందుకు కాదో సీఎం జగన్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ‘జగన్ అమరావతికి జై కొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. ప్రధాని మోదీ (Narendra Modi) చెబితే రాజధాని ఇక్కడి నుంచి కదిలే అవకాశం లేదు. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడే శక్తి అమరావతికి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) నమ్మారు’ అని పేర్కొన్నారు.
అమరావతి రైతుల ఉద్యమానికి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ మంచుమర్తి అనురాధ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రులు ఆది నారాయణరెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతులతో పాటు కూర్చున్నారు. అమరావతి రాజధాని కొనసాగాలంటూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిమాండ్ చేశాయి.