వాహనాల తనిఖీ (Vehicle Checkup) సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సరుకులు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్న వాటిని స్టేషన్ (Police Station)లో భద్రపరుస్తారు. అలాంటి వస్తువులు ఓ పోలీస్ స్టేషన్ లో మాయమయ్యాయి. భద్రపరచిన నగదు (Cash), ఆభరణాలు (Ornaments) కనిపించకుండాపోయాయి. స్టేషన్ లో అపహరణకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కలకలం రేపుతోంది. అపహరణకు గురైన వాటిలో 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రెండేళ్ల కిందట కర్నూలు జిల్లాలోని (Kurnool District) పంచలింగాల చెక్ పోస్ట్ (Panchalingala Checkpost) వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల సమయంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారులు ఆభరణాలు, నగదుతో కనిపించారు. వాటికి సంబంధించిన పత్రాలు చూపించాలని కోరగా.. వారి వద్ద అవి లేవు. అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించి తమిళ వ్యాపారుల నుంచి రూ.75 లక్షల విలువైన 105 కిలోల వెండి ఆభరణలు, రూ.2.05 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్టేషన్ లోని బీరువాలో భద్రపరిచారు. ఇటీవల మార్చి 27వ తేదీన ఆ వ్యాపారులు కోర్టు అనుమతితో ఆ వస్తువులను తీసుకునేందుకు స్టేషన్ కు చేరుకున్నారు.
అనుమతి పత్రం పరిశీలించిన పోలీసులు ఆభరణాలు, నగదు అప్పగించేందుకు బీరువా తెరిచారు. కానీ బీరువాలో అవి కనిపించలేదు. విలువైన ఆభరణాలు, భారీగా నగదు మాయం కావడం సీఐ రామలింగయ్య అవాక్కయ్యారు. స్టేషన్ లో అపహరణకు గురవడం విస్మయానికి గురి చేసింది. స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఆ వస్తువులు ఎక్కడా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. కాగా వాటిని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి స్టేషన్ లో నలుగురు సీఐలు బదిలీ అయ్యారు. దీంతో ఆ నలుగురిని పిలిచి విచారణ చేపడుతున్నారు. కాగా ఈ విచారణ గుట్టుగా చేపడుతున్నారు. స్టేషన్ లోనే ఆభరణాలు, నగదు మాయమైన విషయం బయటకు పొక్కితే తమ పరువు పోతుందని భావించి రహాస్యంగా విచారణ చేస్తున్నారు. కాగా స్టేషన్ లో వస్తువులు మాయంపై ఉన్నత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.