Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి విషయంలో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఏపీ పోలీసులపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలోని విషయాలు.. నాగార్జున సాగర్, విజయపురి టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఏపీ పోలీస్ ఫోర్స్‌ను ఏ-1 అంటారు. తెలంగాణ భూభాగంలోకి చొరబడ్డారని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది.
ఏపీ పోలీసులు 500 మంది సాయుధ బలగాలతో సాగర్ డ్యామ్ వద్దకు వచ్చారని ఫిర్యాదు నమోదైంది. ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఉన్న ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుడి కాల్వ 5వ గేటు నుంచి ఏపీకి నీటిని విడుదల చేశారు. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా నీటిని అక్రమంగా విడుదల చేస్తున్నారని తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 447, 427 కింద కేసు నమోదు చేశారు.మరోవైపు కృష్ణా రివర్ బోర్డు అధికారులు నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం వద్దకు చేరుకున్నారు. డ్యాం 13వ గేటు దగ్గర ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర రెండో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. సాగర్ డ్యామ్ వద్ద ముళ్ల కంచెల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ వైపు భారీగా పోలీసులు మోహరించారు.