»Another Covid Like Pandemic Could Occur In The Next 10 Years
Corona: కరోనాను మించిన భయంకరమైన వైరస్… మరో పదేళ్లలో..!
రాబోయే దశాబ్దంలో COVID-19 వంటి(similar pandemic) ప్రాణాంతక మహమ్మారి సంభవించే అవకాశం 27.5 శాతం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. వైరస్లు తరచుగా పుట్టుకొస్తున్నందున ఇది జరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని వేల మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి భయం నుంచి కోలుకుంటున్నాం. ఈలోపే మళ్లీ కేసులు పెరగడం మొదలయ్యాయి.
ఇదే సమయంలో మరో వైరస్ పుట్టుకొస్తే.. అది కూడా కోవిడ్ కంటే డేంజర్ అయితే.. ఇక అంతే ప్రపంచం మొత్తం అంతం కాక తప్పదు. కానీ ఈ ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. రానున్న పదేళ్లలో కోవిడ్ తరహాలో(similar pandemic).. అంతకంటే డేంజర్ వైరస్ పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దీని వల్ల మరణాలు కూడా భారీగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇటీవల లండన్ కేంద్రంగా జరిగిన పరిశోధనలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కొత్త వైరస్ పుట్టుకొచ్చేందుకు అవకాశం 27.5 శాతం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యం ఉన్న కొత్త వ్యాధులు పుట్టుకురావడం, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడం వల్ల కొత్త వైరస్లు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే వైరస్ పుట్టుకొచ్చిన 100 రోజుల్లోగా వ్యాక్సిన్ను తయారు చేయగలిగితే దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.