ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు (Amazon layoffs) మొదలయ్యాయి. తొలి విడత లేఆఫ్స్‌లో (laying off) పది వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన అమెజాన్ తాము మరోసారి ఉద్యోగుల తొలగింతలను చేపట్టనున్నట్లు గత నెలలో ప్రకటించింది. ఈసారి మొత్తం దాదాపు తొమ్మిది వేల మందికి ఉద్వాసన తప్పదని వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఆయా ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా తొలగింపు సందేశాన్ని పంపించింది. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, శాన్ డియోగోలో ఈ కంపెనీకి చెందిన ఓ స్టూడియోలో కొందరు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
వీరి బాధ్యతలను మిగతా ఉద్యోగులకు బదిలీ చేస్తున్నట్టు అమెజాన్ గేమ్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్ హార్ట్మన్ (Christoph Hartmann, vice president, Amazon Games) తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులకు పంపించిన నోటీసులో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం కష్టతరమైనదన్నారు. సంస్థకు ఉన్న ప్రస్తుత ప్రాజెక్టులు, దీర్ఘకాలిక లక్ష్యాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన వారితో త్వరలో ఓ సమావేశాన్ని నిర్వహించి తదుపరి న్యాయపరమైన కార్యాచరణపై చర్చిస్తామన్నారు. వారికి పరిహారాన్ని కూడా చెల్లిస్తామని చెప్పారు. తొలగించబడిన ఉద్యోగులకు కంపెనీ తరపు నుండి హెల్త్ ఇన్సూరెన్స్, ఔట్ ప్లేస్మెంట్ సర్వీసెస్ తదితర సేవలు కూడా కొంతకాలం పాటు కొనసాగుతాయని చెప్పారు.