హైదరాబాద్ ORRపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, బొలెరో వాహనాన్ని ఓ లారీ వచ్చి ఆకస్మాత్తుగా ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ నుంచి కీసర వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటింది. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న బొలెరో కారును ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది.
బొలెరో డ్రైవర్‌తో పాటు కారులోని ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లారీలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ఘటనలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. పత్తి లోడుతో తొర్రూరు వైపు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి ఆర్డీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ రాజేష్ మృతి చెందగా, నలుగురు మహిళా కార్మికులు డీసీఎం క్యాబిన్లో ఇరుక్కుపోయారు. గంటపాటు నరకయాతన అనుభవించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహిళలను క్యాబిన్ నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు. అయితే వారిలో ఎవరికీ గాయాలు కాలేదు.