Big Breaking: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్..ఏసీపీ కోర్టు తీర్పు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఈ స్కామ్ జరగడానికి ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబుకు 15 రోజుల రిమాండ్‌ను విధిస్తూ కోర్టు అధికారులను ఆదేశించింది.
ఏపీ రాజకీయాల్లో స్కిల్ స్కామ్ కేసు సంచలనంగా రేకెత్తించింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. సెప్టెంబర్ 22 వరకూ చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. గత 24 గంటల నుంచి క్షణ క్షణం ఉత్కంఠగా సాగిన ఈ కేసులో కోర్టు రిమాండ్‌తో సద్దుమణిగింది. అయితే ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు తమ నిరసనలను తెలుపుతున్నారు.
స్కిల్ స్కామ్ కేసులో నంద్యాలలో శనివారం తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశాక 24 గంటలు ముగిసే సమయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరును ఏ37గా చేర్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారని, తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు.
2021 డిసెంబర్ 9వ తేది కంటే ముందు నేరం జరిగిందని, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్ల రూపాయలు చెల్లించారని సీఐడీ ప్రకటించింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్ రిపోర్ట్ ఏసీబీ కోర్టుకు సమర్పించింది. చంద్రబాబును 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ డిమాండ్ చేయడంతో కోర్టు తీర్పునిచ్చింది.
సుమారు 40 గంటలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నంద్యాల నుంచి చంద్రబాబును విజయవాడకు తీసుకొచ్చిన సీఐడీ అధికారులు శనివారం అర్థరాత్రి వరకు ఆయన్ని విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఉదయం 6 గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో విజయవాడ కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసుల బృందం చేరింది. కోర్టు తీర్పుతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తీసుకెళ్లనున్నారు. ఆదివారం రాత్రి సిట్ ఆఫీసులో చంద్రబాబును ఉంచి రేపు ఉదయం ఆయన్ని సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. హైకోర్టులో రేపు చంద్రబాబు తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటీషన్ వేయనున్నారు.