NLR: జిల్లాలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు వారికి ధైర్యం చెప్పాలని జిల్లా ఇంటర్ RIO అధికారి వరప్రసాదరావు సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఫెయిలైన విద్యార్థులు ఎటువంటి అవమానాలకు లోను కాకుండా ధైర్యంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, బయట ATGH వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 79,426 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 25,889 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కడప: రాజంపేట, పులపుత్తూరు గ్రామ అభివృద్ధి బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని TDP నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మంగళవారం తెలిపారు. అన్నమయ్య డ్యామ్ ఘటనలో నష్టపోయిన గ్రామాన్ని 3 నుంచి 4 నెలల్లో మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని, పునరావాస గృహాల నిర్మాణం, రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించారు.
W.G: భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఉదయం 10 గంటలకు MSME ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఎమ్మెల్యే రామాంజనేయులు, ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
SKLM: నరసన్నపేట పట్టణంలోని ఎండిఓ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీను బుధవారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించనున్నారు. ఈ మేరకు MLA కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ఈ అన్న క్యాంటిన్ ద్వారా పేద ప్రజలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించనున్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
VSP: నక్కపల్లి మండలం వేంపాడు ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారి ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చని డాక్టర్ కె. రఘు తెలిపారు. మంగళవారం వేంపాడు శివారు గునిపూడిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పేర్రాజు, ఫార్మసిస్ట్ రామకృష్ణ పాల్గొన్నారు
ATP: రాప్తాడు నియోజకవర్గ YCP సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. రాప్తాడులో ఆయనను అదుపులోకి తీసుకుని కుప్పానికి తరలించినట్లు సమాచారం. గిరీష్ రెడ్డిపై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. అయితే, ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సత్యసాయి: ధర్మవరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఇప్పటి వరకు 727 మందికి పరీక్షలు చేసి, 135 మందికి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
కృష్ణా: మాజీ సీఎం YS జగన్‌ను ఆయన నివాసంలో కలిసి శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి ఆహ్వానించారు. కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానంలో రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈనెల 19 నుంచి 29 వరకు మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు.
PLD: అమరావతి మండలం దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ నెల 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
PPM: జిల్లాలో సీతానగరం మండలం పెదబోగిల పంచాయతీలో పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ తీర్మానం చేసినట్లు స్థానిక MPDO ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామస్టులతో సమావేశమై వారి అభిప్రాయంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని, స్వచ్ఛాంధ్రకు ప్రజలందరూ సహకరించాలన్నారు.
CTR: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఇవాళ ప్రభుత్వం విడుదల చేయనుంది. జిల్లాలో ఇంటర్మీ డియట్ పరీక్షలు రాసిన 29,279 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 14,729 మంది ఫస్టియర్ కాగా, 14,550 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ఆసక్తిగా విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను తాడేపల్లిలో తన నివాసంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖచిత్రం పై ప్రస్తుత పరిస్థితులను జగన్ వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని జగన్ సూచించారు.
TPT: చంద్రగిరిలో అన్న క్యాంటీన్‌ను ఇవాళ సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. రూ.61 లక్షల తుడా నిధులతో చంద్రగిరిలో అన్న క్యాంటీన్ నిర్మించారు. ఈ క్యాంటీన్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 500 మందికి పైగా భోజన ఏర్పాట్లు చేయనున్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు.
దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను బుధవారం ప్రారంభిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించారు. దర్శి పురపాలక సంఘం పరిధిలో పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.