బాపట్ల: సంతమాగులూరు మండల పరిధిలోని ఏల్చూరి గ్రామంలో నిర్వహించాల్సిన చేపల చెరువు బహిరంగ వేలం వాయిదా పడింది. అధికారులు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వేలం నిర్వహించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వేలం నిర్వహణకు సంబంధించి తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ప్రకాశం: పొదిలి మండలం ఏలూరు గ్రామంలో మద్యం మత్తులో మంగళవారం రాత్రి బీహార్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు హుస్సేన్ అనే వ్యక్తిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో హుస్సేన్‌కి తీవ్ర గాయాలు కావడంతో పొదిలి ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASR: కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 37 అంగన్వాడీ ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 23న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం హాజరు కావాలని సీడీపీవో ఎల్. దేవమణి మంగళవారం తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం ఉదయం 11గంటలకు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం భగవద్ రామానుజాచార్య తిరునక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు, అనంతరం తదియారాధన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
SKLM: జిల్లా కేంద్రంలోని కొన్న వీధిలో జరుగుతున్న నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం రాత్రి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
PPM: ఈనెల 23న శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా,ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. వేడుకలకు జిల్లాస్థాయి అధికారులు, పాల్గొంటారని చెప్పారు.
కోనసీమ: మురమళ్లలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకకు MLA దాట్ల సుబ్బరాజు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు స్వామి వారు చంద్ర ప్రభ వాహనంపై గ్రామోత్సవంలో ఊరేగారు. ఎదురు సన్నాహం, ద్వాదశ ప్రదక్షిణల అనంతరం వేద మంత్రాల మధ్య కళ్యాణ మహోత్సవం జరిపారు.
ASR: జిల్లాలో వచ్చే ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 26 వరకు స్వల్ప వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. 0.2 నుంచి 2.1 మి.మీ వరకు వర్షపాతం ఉండొచ్చని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీల మధ్య కొనసాగనున్నాయి. రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
NLR: అనంతసాగరం మండలంలోని పాత దేవరపల్లిలో మంగళవారం రాత్రి చుక్కల దుప్పి ఒక ఇంట్లోకి ప్రవేశించింది. గ్రామ సమీపంలోని ఉత్తర కాలువ వద్దకు నీటి కోసం వచ్చిన దుప్పిని కుక్కలు గమనించి తరమడంతో గ్రామంలోని ఒక ఇంట్లోకి దూరింది. స్థానికులు దుప్పిని బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సత్యసాయి: వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. మక్బూల్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
SKLM: అన్న క్యాంటీన్ల నిర్వహణలో నాణ్యత పెంచాలి అని అన్న క్యాంటీన్ల సీఈవో పోతుల వంశీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్న క్యాంటీన్ల అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్న క్యాంటీన్ల పనితీరు, భోజన నాణ్యత పై నిరంతరం ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
పల్నాడు: జిల్లాలో అనుమానాస్పదంగా దాచిన పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో కృష్ణాలయం దగ్గర ఓ ఇంటి మరుగుదొడ్డిలో ప్లాస్టిక్ డబ్బాలో ఐదు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. DSP హనుమంతరావు ఆధ్వర్యంలో క్లూస్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడికి ఇవి ఎలా వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.
VSP: జిల్లా వైసీపీ కార్యాలయంలో అధ్యక్షుడు కె.కె. రాజు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు మరియు సచివాలయ స్థాయిల్లో పటిష్టం చేయాలని, ఇందుకోసం సమగ్రమైన కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభ్యుల వివరాలను డిజిటల్ డేటాబేస్‌లో నమోదు చేసి, నిర్ణీత గడువులోగా కార్యాలయానికి సమర్పించాలన్నారు.
KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిన్నటి పత్తి ధరలు రైతులకు నిరాశ కలిగిస్తున్నాయి. మార్కెట్‌లో నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.7,350 నుంచి రూ.9,011 వరకు మాత్రమే ధర లభిస్తోంది. గతంతో పోలిస్తే ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులు పెరిగినా, దిగుబడికి తగిన ధర రాకపోవడంతో నష్టాలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.