VSP: జీవీఎంసీ పరిధిలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన అత్యంత అవసరమని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
TPT: రేపు ఉదయం 9:30 గంటలకు వెంకటగిరి పట్టణంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. డక్కిలి, బాలయపల్లి, వెంకటగిరి రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
ATP: జనగణన-2027లో భాగంగా ఈనెల 16 నుంచి 30 వరకు జిల్లాలో ‘స్వీయ గణన’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15 రోజుల పాటు వివిధ వర్గాలకు షెడ్యూల్ ఖరారు చేశారు. 16న ప్రజాప్రతినిధుల గణనతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.
NDL: జనగణన 2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్-ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. https://se.census.gov.in ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
AKP: జనగణన-2027లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. తొలిసారిగా ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల పౌరులు se.census.gov.in పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చునన్నారు.
ASR: అనంతగిరి మండలం గాదిల్లోవ గ్రామంలో గిరిజనులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 23 కుటుంబాలు మైళ్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్నారు. వర్షాకాలంలో బురద నీరు తాగాల్సి రావడంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
PPM: పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవర్ పరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ అగ్నిమాపక అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 231 మంది అమరవీరులకు నివాళులర్పించారు.
GNTR: తెనాలిలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రదర్శించిన అంబేద్కర్ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చిత్రాన్ని చూస్తూ పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, నటీనటులు పాల్గొన్నారు.
కోనసీమ: గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వెలుగు సంఘాల సహాయకులు, వీఓఏలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న 51 మంది వీఓఏలకు ఎమ్మెల్యే, ఆకుల రామకృష్ణ చేతుల మీదుగా స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు.
KRNL: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను రేపు(బుధవారం) విడుదల చేయబోతున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా HIT TV యాప్ లో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
VSP: డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత భాగ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు.
NLR: ఉదయగిరి మండల పరిధిలోని బండగానిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామ ఎస్టీలకు ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ నివేశిత (ఇంటి) స్థలాలు పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. 32 మంది ఎస్టీలకు నివేశిత స్థలాల పట్టాలతో పాటు ఆయన ట్రస్టు ద్వారా మహిళ లబ్ధిదారులకు చీరలు అందజేశారు. అనంతరం బిజ్జంపల్లిలో రూ.46.80 లక్షలతో సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.
W.G: దుంపగడప వీ.వీ. గిరి ప్రభుత్వ కళాశాలలో డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. టీ. నాగేశ్వరావు అధ్యక్షత వహించి అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలను వివరించారు. ముఖ్యవక్తగా యూ. శ్రీనివాసరావు రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను తెలియజేశారు. అనంతరం విగ్రహానికి నివాళులు అర్పించారు.
NDL: పగిడ్యాల మండలం ఎం. గణపురం గ్రామానికి చెందిన వడ్డె మద్దిలేటి (65) వడదెబ్బతో మృతి చెందారు. ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
VSP: మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని నాయకత్వంలో ముందుకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా రిజర్వేషన్‌పై నిపుణుల చర్చలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవసరమని, మహిళలకు నిర్ణయాధికారం పెరగాలని పేర్కొన్నారు.