AKP: వైసీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం సబ్బవరం మండలం గొటివాడలో పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు పి. సురేష్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పాల్గొన్నారు.
EG: ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నిర్వహణ, భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి దీనిపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో, ఏర్పాట్లన్నీ పక్కాగా పూర్తి చేయాలని సూచించారు.
VSP: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సోమలింగం పాలెం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సాయిబాబా, స్కూల్ కమిటీ ఛైర్మన్ నాగ విశ్వేశ్వరరావు సోమవారం విజ్ఞప్తి చేశారు. జడ్పీ హైస్కూల్ పరిధిలో వారు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు.
PPM: జిల్లా కేంద్రంలో ఈ నెల 22 న నిర్వహించబోతున్న మెగా కోలాటం గిన్నిస్ బుక్ ప్రదర్శనకు విద్యార్థులను సన్నద్ధం చెయ్యాలని బలిజిపిట MEO-1సామల సింహాచలం సూచించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని హైస్కూల్ HMలు, PD లతో గూగుల్ మీట్ ద్వారా రెండో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్కూల్ నుండి 50 మంది విద్యార్థులతో ఒక టీంను తయారు చేయాలన్నారు.
ASR: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పిజిఆర్ఎస్ సమర్థవంతమైన వేదికగా పనిచేస్తోందని కలెక్టర్ టీ. నిషాంతి పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా పిజిఆర్ఎస్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
AKP: ఎస్. రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీలో అసంపూర్తిగా ఉన్న జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలని మాజీ సర్పంచ్ కర్రి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలో 2021లో మొదలైన జీవన్ మిషన్ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు.
సత్యసాయి: తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళనాడు సాయి యువత ‘త్యాగతిన్ శిఖరంగాళ్’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. సంఘం కాలం నాటి పారి, పేగన్ వంటి ఏడుగురు గొప్ప దాతల త్యాగనిరతిని ఈ నాటకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. మూగజీవాలు, ప్రకృతి పట్ల వారు చూపిన కరుణను కళ్ళకు కట్టినట్లు చూపారు.
KRNL: మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఎస్సై మల్లికార్జున సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నిషేధిత వస్తువుల రవాణాపై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి, సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలకు జరిమానా విధించామన్నారు.
NLR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల సోమవారం తెలిపారు. బస్సుల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్‌ను పరిశీలిస్తున్నామని, హైవేలపై బ్లాక్ స్పాట్స్‌ను ఇప్పటికే సరిదిద్దామని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాల మరణాల రేటు 20% తగ్గిందని ఆమె పేర్కొన్నారు.
KKD: తుని మండలం డీ. పోలవరంలో సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు పెంచేందుకే ఈ కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.
KRNL: యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని సోమవారం జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనాలని సూచించారు.
VSP: ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఈనెల 15న మోడల్ కెరీర్ సెంటర్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మేళా జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత పత్రాల నకళ్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సంస్థ డిప్యూటీ చీఫ్ దొరబాబు సూచించారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని అవుకు మెట్ట వద్ద ఇవాళ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా NDA కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి క్యాంప్ కార్యాలయం పిలుపునిచ్చింది.
VZM: బొబ్బిలి DSP గా గోవిందరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ DSPగా పని చేసిన భవ్యరెడ్డిను సరెండర్ చేసిన నేపథ్యంలో VZM DSP గా పనిచేస్తున్న ఆయనను బొబ్బిలి బదిలీ చేయడంతో బాధ్యతలు స్వీకరించి బొబ్బిలి కోటలో స్దానిక MLA బేబినాయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్లో గంజాయి, సైబర్ నేరాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
ASR: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచడం, చెరువులు, జలాశయాలను పునరుద్ధరించడం లక్ష్యంగా “జలధార-జలహారతి” కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ నిషాంతి సోమవారం అధికారులను ఆదేశించారు.100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో, ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో సాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. నీటి వనరులకు సాంకేతికత అనుసంధానించి నీటి వనరులు పునరుద్ధరించాలన్నారు.