KRNL: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే బర్తరాఫ్ చేయాలని ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధరూర్ జేమ్స్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
GNTR: నగరంపాలెం పీఎస్ పరిధిలోని సత్తెనపల్లి రోడ్డులో విజయలక్ష్మి బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఖాతాల్లో రూ.3,748 ఉన్నట్లు గుర్తించారు. తదుపరి విచారణకు కేసును నగరంపాలెం పోలీసులకు అప్పగించామన్నారు.
VZM: జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు SP దామోదర్ ఆదివారం తెలిపారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
AKP: మునగపాక మండలం తోటాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. 2010-11 బ్యాచ్‌కి చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి భోజనాలు చేసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు.
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ జిల్లా నేర సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని, సీసీటీఎన్ఎస్ డేటా అప్‌డేట్ చేయాలని సూచించారు. రౌడీషీటర్లకు వారానికి కౌన్సెలింగ్, గంజాయి కేసుల్లో సస్పెక్ట్ షీట్లు తప్పనిసరి అన్నారు. మహిళా భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొత్తూరులో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆళ్ళగడ్డ పట్టణానికి చెందిన వెంకట నాగరాజు 395 గ్రాముల వెండి నాగభరణము వితరణ చేశారని ఈవో రామకృష్ణ తెలిపారు. వెండి నాగాభరణం అందించిన దాతలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేసినట్లు వివరించారు.
W.G: ఆకివీడులో అర్థరాత్రి గొంతేనమ్మ గుడిని కూల్చివేయడం అప్రజాస్వామికమని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తీవ్రంగా ఖండించారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించి, పోలీసు, పంచాయతీ సిబ్బందితో ఈ చర్య చేపట్టడం దారుణమన్నారు. ఘటనలో అధికార యంత్రాంగం, పోలీసుల పాత్రపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం రేపు (సోమవారం) ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుందని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ నవీన్ ఇవాళ తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
W.G: పాలకొల్లు హౌసింగ్ బోర్డులోని ఏ సిటీ సైన్స్ సెంటర్లో ఏప్రిల్ 27 నుంచి మే 10 వరకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కన్వీనర్ పి. శ్రీశ్రీ తెలిపారు. విద్యా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో సైన్స్ ప్రయోగాలు, చిత్రలేఖనం, హస్తకళలపై అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అన్నమయ్య: పీలేరులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాజ్యాంగ హక్కు అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ అన్నారు. మతం మారినా దళితుల సామాజిక పరిస్థితులు మారవని,1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వివక్షపూరితమని విమర్శించారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
GNTR: పెట్రోల్, డీజిల్ కొరత వదంతులతో ప్రజలు వాహనాలను ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. కానీ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంధనం విస్తరించి ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్యాంక్ పూర్తిగా నింపకుండా కొంత ఖాళీ ఉంచితే సేఫ్ అని పేర్కన్నారు. వేడిలో ఫుల్ ట్యాంక్ వాహనాలు నిలిపితే ప్రమాదాలు ఎక్కువవుతాయని హెచ్చరించారు.
E.G: ప్రపంచ స్థాయిలో ఏర్పడుతున్న ఇంధన సరఫరా అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు JC వై.మేఘా స్వరూప్ తెలిపారు. ఆదివారం రాజమండ్రిలో JC మాట్లాడారు. సంబంధిత మంత్రి, కమిషనర్ & ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు.
PPM: ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా C-KYC ప్రక్రియ చెయ్యాలిని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు ఆయన సాలూరు డీసీసీబీ బ్రాంచ్‌ను ఆదివారం ఆకస్మికంగా సందర్శించి, C-KYC ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. RBI మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా C-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
AKP: ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరించింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ త్వరితగతిన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితి సవ్యంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ASR: జీకే వీధి మండలం సంకాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.