NTR: రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఈవీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. దశలవారీగా ఈవీ బస్సులను విస్తరించి, పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని విభాగాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ELR: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని 48 గంటల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన జూమ్ సమావేశంలో ఆమె జనగణన పురోగతిని సమీక్షించారు. 2011 జనాభా గణాంకాలతో పోల్చి చూస్తూ.. వ్యత్యాసాలున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా గణన చేపట్టాలని సూచించారు. శాశ్వత వలసదారులను సక్రమంగా నమోదు చేయాలని ఆమె అన్నారు.
W.G: జిల్లాలో నీటి కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా చెరువుల వ్యర్థ జలాలను డ్రైన్లు, కాలువల్లోకి నేరుగా వదలకుండా నిరంతర నిఘా ఉంచాలన్నారు.
KDP: దువ్వూరు మండలానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో వల్లూరు మండలం కోట్లూరు గ్రామానికి ఈశ్వ ర్ను శనివారం అరెస్టు చేసినట్లు మైదుకూరు గ్రామీణ సీఐ జె.శివశంకర్, ఎస్సై ధనుంజయుడు తెలిపారు. నిందితుడిని మైదుకూరు కోర్టులో హజ రుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు వివరించారు.
CTR: ప్రభుత్వ, ప్రైవేటు ITIలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. అభ్యర్థులు https: //itiadmissions.ap.gov.in/iti/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.
TPT: ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు భూ సేకరణ పనులను శనివారం పరిశీలించారు. కాలుష్య ప్రభావంతో తరలిస్తున్న అగ్రహారం ఆర్ఆర్-2 గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ తరలింపు, భూ సేకరణ పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంగంపేట ఏపీఎండీసీ ముగ్గురాయి గనులను సందర్శించి ఖనిజ సంపద వివరాలను పరిశీలించారు.
ATP: నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో కోరారు. ఆయన మాట్లాడుతూ.. జూనియర్ అసిస్టెంట్లకు 02, ల్యాబ్ అటెండర్లకు రెండు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మూడు ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
PLD: చిలకలూరిపేటలో ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో మైనర్ బాలుడికి గుంటూరు జువైనల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. బాలికను నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకెళ్లి దాడి చేసినట్లు విచారణలో తేలింది. జడ్జి బి.శోభారాణి ఆదేశాలతో బాలుడిని విశాఖపట్నంలోని స్పెషల్ హోంకు తరలించారు.
AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో చెరువుల అభివృద్ధిపై రైతులతో శనివారం ఏషియన్ పెయింట్స్ ప్రాజెక్ట్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అనిత సూచన మేరకు సీఎస్ఆర్ నిధులతో చెరువులను అభివృద్ధి చేయడానికి కంపెనీ ముందుకు వచ్చినట్లు ప్రతినిధులు కిరణ్ కుమార్, వెంకటరావు తెలిపారు. పొలాలకు సాగునీరు వెళ్లే మార్గాలు, కాలువల అభివృద్ధి చేస్తామన్నారు.
మార్కాపురం జిల్లా పామూరు(M) బొట్లగూడూరు గ్రామ సెంటర్లో శనివారం రాత్రి తాగిన మత్తులో ఓ వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శివ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే శివ స్నేహితుడు 108 అంబులెన్సులో పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కందుకూరుకు తరలించారు. జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
NDL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ సింహాచలం నాయుడు శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనలు అందించి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.
NDL: చాగలమర్రి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కేరళ హాస్పిటల్ ఎదురుగా నిలిపి ఉన్న ఓ ఆటోపై అకస్మాత్తుగా విద్యుత్ స్తంభం విరిగి పడింది. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్తంభం పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి విరిగిన స్తంభాన్ని తొలగించాలన్నారు.
BPT: అడవులదీవి పీఎస్ పరిధిలోని ఒక పాత హత్య కేసులో నిందితుడికి గుంటూరు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మహమ్మాదియపాలెంకు చెందిన 21 మంది నిందితులపై నమోదైన ఈ కేసులో ఇప్పటికే 13 మందికి యావజ్జీవ శిక్ష పడింది. తాజాగా మరో నిందితుడిపై విచారణ పూర్తికావడంతో కోర్టు శనివారం ఈ తీర్పు వెల్లడించిందని ఆయన వివరించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టింది. అదే సమయంలో మినీ కంటైనర్ లారీ ఐచర్ వాహనాలు ఢీకొని రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని CPM జిల్లా కార్యదర్శి గోపాలన్ మండిపడ్డారు. శనివారం విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆయన స్పందిస్తూ, అభివృద్ధి పేరుతో కాకుండా బడాబాబులు, భూస్వాములు, ఆక్వా చెరువుల యజమానులకు స్థలాలు కట్టబెట్టడానికే పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు.