ATP: గుత్తి పెన్షనర్ల భవనంలో బుధవారం పెన్షనర్ల ఆశాజ్యోతి నకారా 112 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నకారా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. పెన్షనర్ల హక్కుల కోసం సాధన కోసం నకారా ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. ఫించన్ అనేది ప్రభుత్వ దయ దక్షిణ్యం కాదని అది ఉద్యోగి హక్కు అన్నారు.
NDL: చాగలమర్రి మండలంలోని మూడురాళ్ళపల్లె గ్రామంకు చెందిన ఓబులమ్మ(65) ఉపాధి పనులకు వెళ్తూ జీవనం సాగించేది. బుధవారం ఉపాధి పనులకు వెళ్ళి పని ముగించుకొని మోటర్ సైకిళ్లో ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా క్రింద పడింది. వెంటనే స్థానికులు 108 సహాయంతో వాహనంలో చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
PLD: పెదకూరపాడు మండలంలోని అన్ని ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమీక్ష సమావేశం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు హెచ్.పీ.సీ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఎంఈవోఏ కుల ప్రసాదరావు, సత్యనారాయణ కోరారు.
BPT: భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి కలగకుండా చూడాలంటే ప్రతి గ్రామంలో నీటి భద్రత సాధించడం అనివార్యమని సంతమాగులూరు మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) ఎనుబర్ల యలమంద పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో “జల ధార-జల హారతి, నీటి భద్రత-నీటి సంఘాల బాధ్యత” అనే అంశంపై ఆయన అధ్యక్షతన ప్రత్యేక కార్యచరణ వర్క్‌షాప్ నిర్వహించారు.
ELR: చింతలపూడి మండలం రాఘవాపురంలో బుధవారం విషాదం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన వేదుళ్ల సత్యనారాయణ(55) అనే వ్యక్తి పొలంలో పని చేస్తూ ఉండగా పాముకాటుకు గురయ్యాడు. స్పందించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
అన్నమయ్య: రాయచోటిలో ప్రవహిస్తున్న మాండవ్యనదికి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నదీ ప్రవాహం పెరిగే సమయంలో పరివాహక ప్రాంత ప్రజలకు ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ గోడ నిర్మాణం చేపట్టి, తీర ప్రాంత ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
VZM: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలని ఎస్పీ దామోదర్ బుధవారం పోలీసు అధికారులను ఆదేశించారు. స్టేషన్లకు వచ్చే మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కల్పించే శక్తి యాప్ పట్ల విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
KDP: పదేపదే దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిపై పోలీసులు పీడీ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. కావటి అరుణపై 16 కేసులు, తొండ పోసమ్మపై 27 కేసులు, తొండ పోతురాజుపై 56 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్ట్ అయ్యి, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు.
ATP: శింగనమల పంచాయతీలో నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ముఖాముఖి నిర్వహించారు. కార్యకర్తల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరూ ఐక్యతతో ఉండి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ సెక్రటరీ చిన్న రాములు ఐఏఎస్, సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు పాల్గొన్నారు.
ASR: దోమల వల్ల మలేరియా తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. పాడేరు మండలం మినుములూరు పీహెచ్సీ పరిధిలోని కందమామిడి వద్ద బుధవారం పలువురు ప్రజలకు దోమ తెరలు పంపిణీ చేశారు. దోమల నివారణకు దోమ తెరలు వాడాలని సూచించారు. అలాగే గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
కృష్ణా: బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను నేరుగా పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. అర్జీలు స్వీకరించి కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి, మిగతావాటిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సేవలు పారదర్శకంగా అందాలని సూచించారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి కి చెందిన విజయలక్ష్మి ఖతార్‌లో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో బుధవారం సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. 2025లో ఖరార్ వెళ్ళిన ఆమె అనారోగ్యం కారణంగా అక్కడ పని చేయలేక అవస్థలు పడ్డారు. ‘కోనసీమ సెంటర్ ఫర్ మేగ్రేషన్’ ద్వారా కలెక్టర్‌ను ఆశ్రయించడంతో ఆమెకు విముక్తి లభించింది.
E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవాలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతారు. వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. వేడుకల ఏర్పాట్లు, వివరాలు వివరించగా, గవర్నర్ రాకతో వర్సిటీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.