ఏలూరు తంగెళ్లమూడిలోని అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ వెట్రి సెల్వి సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆహర నాణ్యత, సిబ్బంది ప్రవర్తనను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్లో ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగారు. అనంతరం క్యాంటీన్ల పరిసరాలలో పరిశుభ్రతను పరిశీలించారు.
KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత నిద్ర మత్తులో వాహనాలు నడిపే డ్రైవర్లను ఆపి, నీళ్లతో ముఖం కడిగించి జాగ్రత్తలు సూచిస్తూ పంపిస్తున్నారు. డ్రైవర్లు తమ కుటుంబాలను గుర్తు చేసుకుంటూ అప్రమత్తంగా వాహనాలు నడపాలన్నారు.
CTR: ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో వెల్లడించిన ఓ బాలికను కార్వేటినగరం పోలీసులు కాపాడారు. మండలానికి చెందిన ఓ బాలిక తనకు జీవితం మీద ఆసక్తి లేదని ఆత్మహత్య చేసుకున్నట్టు సోషల్ మీడియాలో నిన్న రాత్రి పోస్ట్ చేసింది. సోషల్ మీడియా సెల్ పోలీసు సిబ్బంది కార్వేటినగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సీఐ హనుమంతప్ప సాంకేతిక పరిజ్ఞానంతో 15 నిమిషాల్లో బాలిక ఆచూకీ కనిపెట్టారు.
W.G: తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆకివీడు విచ్చేసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావును కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తవిటి నాయుడు, రవితేజ, వల్లి ఉన్నారు.
AKP: అచ్యుతాపురం కేజీబీవీలో బాలిక మృతి చెందిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. సంఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించి ఐదుగురిని సస్పెండ్ చేశామన్నారు. కమిటీలో ఎలమంచిలి, కె. కోటపాడు ఎంఈఓలు సూర్యప్రకాష్, ప్రసాద్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిని జెనీమా ఉన్నట్లు తెలిపారు.
KDP: సీఎం చంద్రబాబును నిన్న సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ (AFCOF) ఛైర్మన్ యాటగిరి రాంప్రసాద్ కలిశారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ఫెడరేషన్ ప్రస్తుత పరిస్థితులపై చర్చించి వినతి పత్రం సమర్పించారు. దీంతో పాటు కడపలో టీడీపీ అభివృద్ధికి పాటుపడాలని సీఎం చంద్రబాబు సూచించారని ఆయన తెలిపారు.
KKD: మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, ఇలాంటి వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని కాకినాడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగ దుర్గా రావు హెచ్చరించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పరిధిలో రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించాలని సోమవారం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి నలుగురును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ప్రకాశం: మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
BPT: చీరాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ముక్కోణం పార్క్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖ నాయకులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ నీలం శామ్యూల్ మోజెస్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
PLD: కొత్త యూజర్ల కోసం BSNL బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు నరసరావుపేట DE చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆయన నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. కేవలం రూ.1కే ప్రత్యేక ప్లాన్ అందుబాటులో ఉందన్నారు. ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ప్రతిరోజూ 100 SMS సౌకర్యం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రోజుకు 2GB డేటా కూడా అందిస్తామన్నారు.
AKP: నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం పరిధిలో 9 మండలాలకు సేవలు అందుతున్నాయి. 1982 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక శకటం ద్వారా అనకాపల్లి జిల్లాలో ఆరు మండలాలు, అల్లూరు జిల్లాలో మూడు మండలాలకు ఆపద సమయంలో సేవలందిస్తున్నారు. అయితే మరో అగ్నిమాపక శకటం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత కోరుతున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
GNTR: పాతగుంటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో ఓ సెక్యూరిటీ గార్డ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజగోపాల్ అనే వ్యక్తి తన గదిలో మృతదేహంగా కనిపించగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
KRNL: ఎమ్మిగనూరు సమీపంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. మహబూబ్ భాష సమక్షంలో వసతులు, రికార్డులు, బోధన విధానాలు పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు సిబ్బందిని అభినందించారు. ఇందులో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.
NDL: బేతంచెర్ల మండలం రేపల్లె గ్రామానికి ఇవాళ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి రానున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య తెలిపారు. ముందుగా పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కోట్ల పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం రేపల్లె గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీలకు వంద శాతం ఉచిత సౌర విద్యుత్ ఏర్పాట్లను ప్రారంభిస్తారన్నారు.