GNTR: రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు se.census.gov.in పోర్టల్ ద్వారా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. 33 ప్రశ్నలతో కూడిన ఈ విధానాన్ని ఏపీ జనగణన డైరెక్టర్ నివాస్ సీఎంకు వివరించారు. ప్రజలు కూడా ఈ నెల 30వ తేదీ వరకు తమ కుటుంబ, ఇళ్ల వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.
NTR: దేశ స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన దివంగత వడ్డే ఓబన్న పోరాట తెగువ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే, ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్, వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఈశ్వర్ గురువారం ఆవిష్కరించారు.
BPT: వంటగ్యాస్ ప్రమాదాల నివారణపై గృహిణులకు అవగాహన ఉండాలని బాపట్ల ఫైర్ ఆఫీసర్ రామ్ సిద్ధార్థ సూచించారు. గురువారం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, వాణిజ్య సముదాయాల వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది ప్రజలకు వివరించారు.
NLR: సంఘం మండలం తహసీల్దార్ బి. సోమ్లా నాయక్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించగా, బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సంఘం మండల ఇంఛార్జ్ తహసీల్దార్‌గా అంబటి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. పదోన్నతి పొందిన నాయక్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు.
ప్రకాశం: జిల్లా వైసీపీలో పలు కీలక నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జరుగుమల్లికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత దగ్గుమాటి బూసిరెడ్డిని వైసీపీ స్టేట్ ఆర్టిజన్ సెల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవికి బూసిరెడ్డిని ఎంపిక చేయడం పట్ల స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
VSP: జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు తమ జీతాల కోసం ఆందోళన బాట పట్టారు. పారిశుద్ధ్య, డే నైట్, ప్యాకేజీ వర్కర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాజువాక జోనల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. శనివారంలోగా జీతాలు అందకపోతే, ఈనెల 20 (సోమవారం) నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు.
NTR: నందిగామ నియోజకవర్గంలో గురువారం ఎండలు తీవ్రంగా పెరగడంతో భానుడు భగభగలాడాడు. నందిగామలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో 41 డిగ్రీలుగా నమోదైంది. ఎండల తీవ్రతతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో బయటికి రావడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.
PPM: జంఝావతి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ నాయకులు ఇవాళ డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు తదితరులు పట్టణంలో ఉన్న కాలువను పరిశీలించి ఖరీఫ్ సీజన్‌కు ముందు పనులు చేపట్టాలని కోరారు. వేసవిలోనే పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కోరారు.
SKLM: ఇచ్చాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు గురువారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పురుషోత్తపురం గ్రామంలో షిర్డీ సాయిబాబా దేవాలయ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ASR: డుంబ్రిగూడ, కొర్రాయి, అరకు, గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించినట్లు తహసీల్దార్ త్రివేణి తెలిపారు. గ్రామ సభ తీర్మానాల మేరకు తాగునీరు, పారిశుద్ధ్యం, మరమ్మతుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఎంఆర్వో, ఎంపీడీవోలతో కలిసి జలపాతాలు, ప్రమాదకర ప్రాంతాల గురించి స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయంలో యువజన, విద్యార్థి విభాగాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నోటిఫికేషన్ల ఆలస్యం, పరిశ్రమల లేమి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదన్నారు.
VZM: దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు ఇవాళ సందడి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ చర్చల నేపథ్యంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు దిగారు. ఇందులో ఇంఛార్జ్ మినిస్టర్ అనిత, మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు జగదీశ్వరి, నాగమాధవి ఉన్నారు.
ATP: జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్పీఓలు) పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడంపై యంత్రాంగం దృష్టి సారిస్తుందని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. కూడేరు మండలం ముద్దలపురంలోని రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీని ఆయన సందర్శించారు. మే 1 నుంచి జిల్లాలోని 200కు పైగా ఎఫ్పీఓల ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామన్నారు.
GNTR: ఉండవల్లి గుహల మలుపు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బస్సుల డ్రైవర్లు గాయపడ్డారు. ప్రమాద సమయంలో కాలేజీ బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
AKP: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరించాలని కోటవురట్ల ఎస్సై విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో జీఎంఎస్‌కేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోడిపందేలు, ఆన్లైన్ బెట్టింగ్, పేకాట, జూదం ఎక్కడైనా జరిగితే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో పిల్లలు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు.