ASR: డుంబ్రిగూడ, కొర్రాయి, అరకు, గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించినట్లు తహసీల్దార్ త్రివేణి తెలిపారు. గ్రామ సభ తీర్మానాల మేరకు తాగునీరు, పారిశుద్ధ్యం, మరమ్మతుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఎంఆర్వో, ఎంపీడీవోలతో కలిసి జలపాతాలు, ప్రమాదకర ప్రాంతాల గురించి స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయంలో యువజన, విద్యార్థి విభాగాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నోటిఫికేషన్ల ఆలస్యం, పరిశ్రమల లేమి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడం లేదన్నారు.
VZM: దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు ఇవాళ సందడి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ చర్చల నేపథ్యంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు దిగారు. ఇందులో ఇంఛార్జ్ మినిస్టర్ అనిత, మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు జగదీశ్వరి, నాగమాధవి ఉన్నారు.
ATP: జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్పీఓలు) పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడంపై యంత్రాంగం దృష్టి సారిస్తుందని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. కూడేరు మండలం ముద్దలపురంలోని రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీని ఆయన సందర్శించారు. మే 1 నుంచి జిల్లాలోని 200కు పైగా ఎఫ్పీఓల ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామన్నారు.
AKP: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరించాలని కోటవురట్ల ఎస్సై విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో జీఎంఎస్‌కేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోడిపందేలు, ఆన్లైన్ బెట్టింగ్, పేకాట, జూదం ఎక్కడైనా జరిగితే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో పిల్లలు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు.
NDL: డోన్ -నంద్యాలకు బస్సులను నడపాలని BJP జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఆర్టీసీ డిపో మేనేజర్ చలపతికి వినతి పత్రాన్ని ఇవాళ అందించారు. ఈ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం 2,3 ఎక్స్‌ప్రెస్ బస్సులు తిరిగేలా చూడాలన్నారు. బస్టాండ్లో చలివేంద్రాలు, బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, జీపీఎస్ లైవ్ లొకేషన్ సదుపాయం కల్పించాలన్నారు.
ATP: CM చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దశమహా విద్య హోమాలు నిర్వహిస్తున్నారు. ఆరవ రోజు నిర్వహించిన చిన్నమస్తా దేవి హోమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి టీజీ భరత్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
KDP: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలుగుదేశం మహిళా ప్రజాప్రతినిధుల బృందం రాజధానికి చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఈ బృందంలో కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో జరిగే చర్చలను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఎన్నో రోజులుగా కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, మట్టిని గురువారం పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. దోమల వ్యాప్తి పెరిగి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గుర్తించిన స్థానికులు అధికారులకు తెలియజేయడంతో నేడు కాలువలను శుభ్రం చేశారు. చెప్పగానే స్పందించిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక, ఆదాయం-ఖర్చులు, చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే కార్యక్రమాలను వివరించారు. రెడ్ క్రాస్ నూతన కార్యవర్గ ఎన్నికలను వాయిదా వేశారు.
TPT: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన రెండవ డిస్ట్రిక్ట్ మీడియా అక్రెడిటేషన్ కమిటీ (DMAC) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీడియా ప్రతినిధుల అక్రెడిటేషన్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియను కొనసాగించారు. ఈ సమావేశంలో అక్రెడిటేషన్ నిబంధనలు, ప్రమాణాలు, పారదర్శకతపై విస్తృతంగా చర్చించారు.
SKLM: ఆధునిక సాంకేతికత ద్వారా రైతుల అభివృద్ధి సాధ్యం అని జిల్లా పరిషత్ ముఖ్య అధికారి ఆర్. వెంకటరమణ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండవ రోజు ఉత్తరకొస్తా మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత జోడించడం ద్వారానే రైతులు అభివృద్ధి సాధిస్తారని అన్నారు.
VSP: భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జనగణన కార్యక్రమాన్ని ఇవాళ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజల సమగ్ర సమాచారం ఉంటేనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు. మొబైల్ ద్వారా స్వీయ గణన పూర్తి చేసి పొందిన ఐడీని ఎన్యూమరేటర్లకు ఇవ్వాలని సూచించారు.
KRNL: జిల్లాలో అకాల వర్షం పడుతోంది. తుగ్గలి, సి. బెలగళ్, గోనెగండ్ల, తదితర మండలాల్లో సాయంత్రం నుంచి వాన కురుస్తోంది. గోనెగండ్ల సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ వద్ద ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎమ్మిగనూరు – కర్నూల్ ప్రధాన రహదారిపై విద్యుత్ తీగలు పడడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.
AKP: ఉపాధి కార్మికుల పొట్ట కొట్టడానికే కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ పథకాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో ఉపాధి కార్మికులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పూటలా ముఖ ఆధారిత హాజరు కాకుండా ఒక్క పూటే తీసుకోవాలన్నారు.