KDP: సిద్దవటం మండలం మాధవరం-1 పంచాయతీ పరిధిలోని బంగారుపేట గ్రామ సమీపంలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
KRNL: దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు మండలం ఆర్.కె. దుద్యాల సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఇసుక అక్రమ తరలింపు, నీటి నిల్వ సామర్థ్యం, తాగునీటి సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
కోనసీమ: జిల్లాలో కొబ్బరికాయ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కొబ్బరి కాయ రూ.16 నుంచి రూ.18 వరకు పలుకుతుంది. అయితే ధర బాగానే ఉన్నా పంట దిగుబడి లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఎకరానికి 1000 కొబ్బరికాయ వచ్చే చోట ఇప్పుడు 500 కూడా రావడం లేదని వాపోతున్నారు. దిగుబడి లేకపోవడంతో ఎంత రేటు ఉన్నా ప్రయోజనం లేదంటున్నారు.
సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 విద్యా సంవత్సరానికి క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. 15 నుంచి 19 ఏళ్ల లోపు క్రీడాకారులు SAAP వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనంతో పాటు ఆధునిక శిక్షణ ఇస్తామన్నారు.
ఏలూరులోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఈనెల 18, 19 తేదీల్లో సేంద్రియ ఆహార ఉత్పత్తుల మేళా నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ భాషా తెలిపారు. ఈ మేళాలో 80 మంది రైతులతో 50 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, 150 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఈ ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NDL: అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్‌గా వెబ్ ల్యాండ్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, అటవీ చెక్ పోస్టులను పోలీస్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేసి భద్రతను పెంచాలన్నారు.
KDP: కలసపాడు MPDO కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు MPDO మహబూబీ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనులపై 19వ విడత సామాజిక తనిఖీ జరుగుతుందన్నారు. తనిఖీలో గుర్తించిన అంశాలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చ జరుగుతుందన్నారు. ప్రజలు, కూలీలు, అధికారులు హాజరుకావాలని సూచించారు.
బాపట్ల: పంగలూరు మండల విద్యాశాఖ అధికారిగా షేక్ కాలేషావలిని ఉన్నతాధికారులు నియమించారు. ప్రస్తుతం దర్శిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇంతకుముందు ఎంఈఓగా ఉన్న కే. నాగభూషణం మార్చిలో పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో కాలేషావలిని నియమించారు.
KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ ఇటిక్యాలను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగిందని పోలీసులు తెలిపారు.
గుంటూరు: తెనాలి చినరావూరులోని సత్యనారాయణ లేక్ పార్కును మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం ఉదయం సందర్శించారు. పార్కు పరిసరాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మరుగుదొడ్లు, పిల్లల ఆట పరికరాలను పరిశీలించి నిర్వహణ మెరుగు పరచాలని ఆదేశించారు. వేసవి కాలంలో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు.
కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన అమలాపురం కలెక్టరేట్లో గురువారం సాయంత్రం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. భవన నిర్మాణ రంగానికి ఇబ్బంది లేకుండా డిమాండ్ మేరకు పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే జొన్నాడ, కపిలేశ్వరపురం, రావులపాడు, ఆలమూరు స్టాక్ పాయింట్లలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలని సూచించారు.
KRNL: కర్నూలు తాలూకా యుపీఎస్ పరిధిలోని గొందిపల్ల సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు. జేసీబీ వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఖాసీం సాహెబ్(43) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆటో డ్రైవర్ బోయ మహేశ్ (39) చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పల్నాడు: డ్రాప్ అవుట్ లేకుండా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ధరణికోట గ్రామం ఎంపీపీ హెచ్ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడీ స్కూలుకు పంపించాలన్నారు. 6 సంవత్సరాలు వచ్చిన చిన్నారులను ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని కోరారు. డ్రాప్ అవుట్ లేకుండా విద్యను అభ్యసించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష (పాలిసెట్-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాలలో మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు.
ATP: విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. నిందితులను సత్వరమే అరెస్ట్ చేయడం, దర్యాప్తును సకాలంలో నాణ్యతగా పూర్తి చేయడం వంటి విధుల్లో రాణించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, మహిళా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించిన వారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.