KRNL: YCP హయాంలో మహిళలను అనేక రకాలుగా కించపరిచారంటూ నిన్న పార్లమెంట్లో MP భైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలకు MLC వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. ‘ఏపీలో కూటమి నేతల అరాచకాలు కనిపించడం లేదా? మీకు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి పదవులు కట్టబెట్టారు. జగన్ హయాంలోనే 50% రిజర్వేషన్లు, డీబీటీ ద్వారా రూ.2.74 లక్షల కోట్లు అందించామన్నారు.
VSP: ఫేకర్స్ లే అవుట్లో ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. సుమారు 800 కుటుంబాలకు వినోదం, పిల్లల ఆటల కోసం వాకింగ్ ట్రాక్, ఫౌంటెన్, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థల వివరాలు, అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీర్లకు ఆదేశించారు.
VZM: మే 9న రాజాంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని స్థానిక కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శారదాంబ కోరారు. గురువారం కోర్టు ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో లోక్ అదాలత్ నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, బీమా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.
NDL: CM రేవంత్ రెడ్డిని గురువారం జిల్లాలోని మహిళా ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, భూమా అఖిలప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ను మహిళా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఢిల్లీకి ఏపీ టీడీపీ మహిళలు వెళ్లారు.
NDL: సంజామల మండలంలో అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.1°C, ఆ తర్వాత కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 44.9°C ఎండ తీవ్రత నమోదైనట్లు గురువారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు నేడు రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43°C – 44.5°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
KRNL: ఇంటర్ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ భార్య సత్తా చాటారు. జిల్లాలోని ఆదోనికి చెందిన ఎస్.సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివారు. సెకండియర్ MPHWలో 1000 మార్కులకు గాను, 991 మార్కులు సాధించారు. ఆటో నడుపుతూ చదివిస్తున్న భర్త జయరాం కష్టానికి ఫలితంగా ఆమె ఇలా ప్రతిభ చాటడంపై ప్రశంసలొస్తున్నాయి.
బాపట్లలో సచివాలయం తనిఖీలో డ్రెస్ కోడ్ పాటించని డిజిటల్ అసిస్టెంట్‌పై కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధులకు నైట్ దుస్తులతో హాజరైనందుకు సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 11 అర్జీలు పెండింగ్‌లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసి, పనితీరును మెరుగుపరచాలని సూచించారు.
W.G: కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్: తిరువూరు పట్టణంలో పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ కే. మనోజ శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలలో చెత్త సేకరణ, కాలువల శుభ్రత పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. శుభ్రత పనులు నిరంతరం కొనసాగాలని అధికారులను ఆదేశించారు.
కాకినాడ- లింగంపల్లి మధ్య నడిచే కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ డైలీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ గురువారం తెలిపారు. కాకినాడ-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ సామర్లకోటలో హాల్ట్ కల్పించినట్లు చెప్పారు. ప్రజలు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కమిషనర్ ఎన్. మౌర్య నిన్న ప్రారంభించారు. రూ.1.63 కోట్లతో 14 కంటైనర్లలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ స్ట్రీట్‌లో నాణ్యమైన ఆహారం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మే 1 నుంచి అన్ని దుకాణాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి.
ATP: కాలవ ఫౌండేషన్ ఛైర్మన్ కాలవ భరత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి భరత్‌తో కలిసి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు చక్కని వేదికలని అభిప్రాయపడ్డారు. క్రీడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
గుంటూరు: రేవేంద్రపాడు కొత్తపాలెంకు చెందిన పుప్పాల కనకమహాలక్ష్మి కష్టాలను జయించి ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితం సాధించింది. కూలీ పనులు చేసే తల్లిదండ్రుల పరిస్థితి ఆమెను మరింత పట్టుదలగా చదివేలా చేసింది. ఇంటర్ బైపీసీలో 990 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె విజయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.
NLR: రాపూరు పెంచలకోన క్షేత్రంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై MLA కురుగొండ్ల రామకృష్ణ చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన నూతన ఫ్లడ్ లైట్లను వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ ప్రారంభించారు. హోమియో వైద్యశాల – నాగార్జున హాస్టల్ మార్గం, అర్థశాస్త్ర విభాగం–కలెక్టర్ బంగ్లా కూడలిలో ఇవి ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యార్థులకు ఇవి ఉపయుక్తంగా మారనున్నాయి.