PLD: మాచవరం మండలంలో RTC ప్రయాణం ప్రమాద భరితంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో వందల సంఖ్యలో మహిళలు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నారు. కూర్చునేందుకు సీట్లు కూడా సరిగ్గా లేక ప్లాట్ ఫాంపై నిలబడి మరి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇలాగైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కవ ఉందని, అదనపు బస్సులు వెయ్యాలని ప్రయాణికులు కోరుతున్నారు.
GNTR: పొలిట్ బ్యూరో సభ్యులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చలను నేడు, రేపు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రధాని, స్పీకర్, కేంద్రమంత్రులను కలిసి మహిళా సాధికారతకు మద్దతుగా కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చుండూరు, పర్చూరు, చీరాల వన్ టౌన్ స్టేషన్‌ల పరిధిలో గురువారం సంబంధిత పోలీస్ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాలను వారు జల్లెడ పట్టి, అనుమతి పత్రాలు లేని 90 బైకులు, మూడు ఆటోలు, ఒక కారును స్వాధీన పరుచుకున్నారు.
ASR: మారేడుమిల్లి మండలం ఉత్తలూరు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి(42) గురువారం అడవి దున్న దాడిలో మృతి చెందాడని సీఐ ప్రసాద్ తెలిపారు. తన జఫ్రా తోటలో పని చేస్తుండగా అడవి దున్న దాడి చేయడంతో అతను స్పాట్‌లోనే మృతి చెందాడని పేర్కొన్నారు. దీంతో, మారేడుమిల్లి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరించారు.
KDP: మైదుకూరు సమీపంలోని కృష్ణాపురంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO మల్లేశ్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్చి నెలలో జరిగిన అబార్షన్లపై ఆడిట్ నిర్వహించారు. అబార్షన్ల ప్రక్రియలు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
NLR: నగరంలోని 39వ డివిజన్ మూలపేట ప్రాంతంలో కమిషనర్ పర్యటించి తాగునీటి సరఫరాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్, ఎన్ఎంసీ ఎస్.ఈ రహ్మత్ జాని, ఈఈ రఘురామ్, ఇతర అధికారులతో కలిసి బ్రాహ్మణ వీధి, ఈ.ఎస్.ఆర్.ఎం వాటర్ ట్యాంక్ పరిసరాల్లో కమిషనర్ పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నీటి సరఫరా స్థితిగతులపై ఆరా తీశారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గురువారం భారతదేశ జనాభా గణన – 2027లో భాగంగా స్వీయ గణన కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ స్లీవా జోజి ప్రారంభించారు. గ్రామంలోని ప్రజల చేత స్వీయ గణన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈ సౌకర్యాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని, సులభంగా, త్వరగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.
KRNL: నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా రేపు ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఇవాళ ‘నారీ శక్తి వందన్ అధినియం’ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ నియోజకవర్గ స్పెషల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 2,000 మంది మహిళలు పాల్గొనాలన్నారు.
GNTR: తెనాలి APSRTC డిపోలో డ్రైవర్లకు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఎంపికైన వారికి 8 గంటలకు రూ.1000, 16 గంటలకు రూ.2000 వేతనం అందించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, అర్హత సర్టిఫికెట్‌లు తీసుకుని డిపో మేనేజర్ కార్యాలయాన్ని సంప్రదించాలని మేనేజర్ ఏ. రాజశేఖర్ తెలిపారు.
CTR: జన గణన -2027లో భాగంగా చిత్తూరు సంతపేట పీఎన్సీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మొదటి దశ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణ తరగతులను గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో మాట్లాడారు. శిక్షణలో భాగంగా జనగణన సర్వేపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు.
ATP: ఉమెన్స్ కాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో విజయం సాధించి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఆర్. వైశాలికి ఎమ్మెల్యే పరిటాల సునీత హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు. సైప్రస్‌లో జరిగిన ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వైశాలి, ప్రపంచ టైటిల్ కోసం తలపడనున్నారు.
డోన్ పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాన్ని ఇవాళ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మన్నె గౌతమ్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
PPM: జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెరిఫికేషన్‌లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, క్షేత్రస్థాయిలో ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
VZM: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో PUC ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన జరుగుతున్న PUC సమీక్షా సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఇవాళ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల వార్షిక నివేదికలు, కార్యకలాపాల వివరాలను సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీపీడీసీఎల్, ఏపీపీఎఫ్‌సీఎల్ సంస్థల కార్యకలాపాలను పరిశీలించారు.
అన్నమయ్య: మదనపల్లిలో పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొని ప్రభుత్వమే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించడం జర్నలిస్టుల సంక్షేమానికి నిదర్శనమన్నారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణుల వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించారు.