VZM: ఈ నెల 15 నుంచి 17 వరకు వంగరలోని 29 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి ప్రణాళికపై గ్రామసభలు నిర్వహణకు సన్నాహకాలు చేస్తున్నట్లు డిప్యూటీ MPDO రామారావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టవలసిన పనులు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణపై చర్చించనునట్లు తెలిపారు.
ఎన్టీఆర్: వియజవాడలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం శిఖామణి సెంటర్ సమీపంలో గంజాయి ఉందన్న సమాచారం మేరకు మాచవరం పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామన్నారు.
PPM: జనగణనను కచ్చితత్వంతో నిర్వహించాలని కురుపాం MLA తోయక జగదీశ్వరీ సూచించారు. శనివారం గుమ్మలక్ష్మీపురం ZP హైస్కూల్‌లో MRO శేఖరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్యుమరేటర్స్ శిక్షణ తరగతులను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి సర్వే చేపట్టాలన్నారు.
NLR: నెల్లూరులో టీటీడీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 48 లక్షలు వసూలు చేసిన కేటుగాడు షేక్ హుస్సేను వేదాయపాలెం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.25.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ దీక్ష వెల్లడించారు. నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులను నమ్మించి ఈ మోసానికి పాల్పడినట్లు, దళారులను నమ్మి మోసపోవద్దని ఏఎస్పీ తెలిపారు.
SS: జిల్లాలోని హిందూపురం, కదిరి సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. హిందూపురం జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, కదిరి జడ్జి జయలక్ష్మి జిల్లా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు ఈ పదోన్నతులు కల్పించారు.
E.G: భీమోలు గ్రామంలోని పెద్ద చెరువును, గంగోలు చెరువును జలదార విజిటింగ్ బృందం పరిశీలించింది. జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షం నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీటితో వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయిలు మెరుగుపడతాయని చెప్పారు. అదేవిధంగా డ్యాంలు,చెరువు గట్టు పటిష్టానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.
బాపట్ల: అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దాడిలో ఆర్‌ఎంపీ డాక్టర్ మేడగం కోటిరెడ్డి మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
KRNL: తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన సి.లలిత(28) భర్త శివ తాగుడకు బానిసై ఆర్థిక ఇబ్బందుల వల్ల భర్త మారడని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నట్లు లలిత తల్లి రామలక్ష్మి తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు జొన్నగిరి ఎస్సై మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి కూతురు, కొడుకు ఉన్నారు.
KDP: ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐగా పనిచేస్తున్న పి.నరసింహరాజును కడప నగరం తాలుకా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ గతేడాది నవంబరు 12న బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా అయిదు నెలలకే స్థాన చలనం కల్పించారు. కడప నేర విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీహరి ఒంటిమిట్టకు రానున్నారు.
VZM: ట్రాక్టర్‌పై నుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు. పార్వతీపురం మండలం కారాడ వలస నుంచి బొబ్బిలి మండలం డొంగురు వలస పెళ్లికి వెళ్లారన్నారు. అనంతరం ట్రాక్టర్‌పై తిరిగి వెళ్తుండగా మితిమీరిన వేగంతో ట్రాక్టర్ నడపడం వల్ల తొట్టెలో ఉన్న వంశీ జారిపడి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ATP: అమరావతి రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
KKD: ప్రభుత్వాల ఆదేశాల మేరకు సామర్లకోటలో పేద ప్రజలు, వలస కూలీలకు చోటా సిలిండర్లను అందిస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శనివారం తెలిపారు. గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా కార్మికులు పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ప్రధాన గ్యాస్ కంపెనీలు ఐదు కేజీల సిలిండర్లు సరఫరా చేపట్టాయి. ఏదేని ఒక గుర్తింపు ఉంటే ఐదు కేజీల సిలిండర్‌ను అందిస్తామన్నారు.
W.G: రాష్ట్రంలో త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. పాలకొల్లులోని అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతిలో భాగమైన రంగస్థల కళలను ప్రోత్సహించేందుకు నాటకోత్సవాలను నిర్వహిస్తామన్నారు.
ఎన్టీఆర్: విజయవాడలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ.220 పలుకుతుండగా, మటన్ కేజీ రూ.900కు చేరింది. చేపలు రకాన్ని బట్టి కిలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. 30 కోడి గుడ్ల ధర రూ.135గా ఉంది. సెలవు రోజు కావడంతో మార్కెట్ల వద్ద రద్దీ కనిపిస్తున్నప్పటికీ, పెరిగిన ధరలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
SKLM: అకాల వర్షానికి నష్టపోయిన టమాటా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. శనివారం కంచిలి M బెంకిలి, జింకి భద్ర, పలాసపురం పంచాయతీల పరిధిలో నష్టం జరిగిన టమాటా పంట పొలాలను పరిశీలించారు. సమస్యను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చర్యలు చేపడతామన్నారు.