కోనసీమ: రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూ రీసర్వే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలో గ్రామసభలు నిర్వహించి, అర్హులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా SP ధీరజ్ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో చెకింగ్ చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. సరిగా పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు.
ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి రూ.16,12,908 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న ఆరుగురు బాధితులకు ఈ ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు.
AKP: జిల్లాలో చెరువులు పునరుద్ధరణపై అధికారులు 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జలధార-నీటి భద్రతపై సమీక్షించారు. జలవనరుల పరిరక్షణ, సాగునీటి వ్యవస్థను బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలన్నారు.కొత్తగా డీసిల్టింగ్ చేయాల్సిన చెరువులను గుర్తించాలన్నారు.
బాపట్ల: హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై బజరంగ్ దళ్ సభ్యులు బాపట్లలో ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఆయన ఫొటోతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులకు వినతిపత్రం అందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
TPT: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడారని TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇటీవల డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో డీజీపీ ఆఫీసు నుంచి తిరుపతి ఎస్పీకి ఆ ఫిర్యాదు అందింది. త్వరలోనే ఎస్పీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రకాశ్ రాజ్ తిరుపతి కోర్టుకు వచ్చే వరకు పరువునష్టం కేసు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
KRNL: నంద్యాల, మన్యం, అల్లూరి, పోలవరం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాతో పాటు కర్నూలులో కూడా ఇవాళ అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
E.G: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో రాజమండ్రిలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 37 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష, 35 మందికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ DSP వై.శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రకాశం: ఒంగోలు సమీపంలోని చదలవాడలో సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో 148 గదుల ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 300 మందికి ఉపాధి లభిస్తుందని హోటల్ ప్రతినిధి రవిశంకర్ జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వ రాయితీలు అందేలా చూడాలని ఆయన జేసీని కోరారు.
ASR: ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్‌కు లభ్ధిదారులు స్పందించాలని అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. మంగళవారం మండలంలోని మాడగడ గ్రామంలో ఐవీఆర్ఎస్ కాల్స్, స్వీయ గణనలపై నిర్వహించిన అవగాహనలో ఆయన మాట్లాడారు. అలాగే స్వచ్ఛరథం గురించి వివరించి, పాత పేపర్లు, వాడని ప్లాస్టిక్, అట్టలు, ఇనుము స్వచ్ఛరథం వద్ద ఇచ్చి నిత్యవసరాలను పొందవచ్చన్నారు. PFO రామస్వామి పాల్గొన్నారు.
VSP: జిల్లా పరిషత్ స్థాయీ కమిటీ సమావేశాలు ఇవాళ జడ్పీ సమావేశ మందిరంలో జరుగుతాయని జడ్పీ సీఈఓ నారాయణమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగే సమావేశాలకు జడ్పీటీసీలు, సంబంధిత అధికారులు హాజరుకావాలని సూచించారు.
KKD: ఈ నెల 27న జరిగే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణానికి రావాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను మంగళవారం ఆహ్వానించారు. అన్నవరం దేవస్థానం EO నల్లం సూర్యచక్రధరరావు కాకినాడలో కలెక్టర్‌ను ఆయన ఛాంబర్లో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవ ఏర్పాట్ల గురించి వివరించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కళ్యాణం జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
AKP: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న పిలుపునిచ్చారు. మంగళవారం అనకాపల్లిలో ఓ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుబ్బన్న మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: నగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం పవర్ కట్ అమల్లో ఉంటుందని అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు కోనసీమ జిల్లా కేంద్రంలో పాటు మామిడికుదురు, పాసర్లపూడి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, అప్పన్నపల్లి, పెదపట్నం, మొగలికుదురు గ్రామాలతో పాటు రాజోలు మండలం తాటిపాక గ్రామానికి కరెంటు సరఫరా నిలిపివేస్తామన్నారు.
KRNL: తుగ్గలి మండలం పైచెరువు తండా గ్రామానికి చెందిన స్వామి నాయక్, మంగమ్మ దంపతుల కుమారుడు రఘు నాయక్ ఇటీవల విడుదలైన JEE మెయిన్స్‌లో 732వ ర్యాంకు సాధించాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి ఈ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.