ప్రకాశం: కొండపి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా గురువారం త్యాగరాజు బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలకు విగాతం కలగకుండా చూస్తానన్నారు. ప్రధానంగా మత్తు పదార్థాలు, పేకాటపై దృష్టి సారిస్తానన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కృష్ణా: మచిలీపట్నం మండలం లక్ష్మీపురం గ్రామంలో మంత్రి కొల్లు రవీంద్ర గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు పాడైపోవడంతో మంత్రి ఆసహనం వ్యక్తం చేశారు. శానిటేషన్ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
Akp: కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అధిక స్థానాలు సాధ్యమవుతాయని యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. పదవీకాలం పూర్తి చేసిన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ATP: గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో జరిగిన మరెమ్మ దేవి జాతర ఉత్సవాల్లో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మండల నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఇలాంటి ఉత్సవాలు ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని పేర్కొన్నారు.
NDL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనను మండలంలో పక్కాగా నిర్వహించాలని తహశీల్దార్ నాగమణి ఇవాళ సూచించారు. బేతంచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. శిక్షకులు నాగరాజు, మహేష్ మూడు రోజులపాటు మార్గదర్శనం చేస్తారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణన జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
KRNL: ఏబీఎన్ రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని సీఐ జయన్నను కోరారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
KDP: మైదుకూరు విద్యుత్ డివిజన్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా సోలార్ యూనిట్లు ప్రభుత్వ మంజూరు చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం తీసుకొని, విద్యుత్ బిల్లుల భారమును తగ్గించుకోవాలని ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మీపతి తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు.
AKP: ఉపాధి హామీ పథకానికి సంబంధించి వేతనదారులకు 10 వారాల బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. గురువారం మునగపాక మండలం వెంకటాపురంలో పని ప్రదేశంలో కూలీలు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గనిశెట్టి మాట్లాడుతూ.. సకాలంలో వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం జాతరలో బాదంపాలు తాగి 125 మందికి పైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆహార భద్రత అధికారులు పంపిన బాదంపాల నమూనాల పరీక్షల్లో మైక్రోబయల్ కంటామినేషన్, ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. మానవ లేదా జంతు మల వ్యర్థాలు కలిసిన నీటిని బాదంపాలలో వాడటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, నిధుల విడుదలపై జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెంరెడ్డి సతీశ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. గురువారం వినతిపత్రం సమర్పిస్తూ రూ.30 కోట్ల గ్రాంట్లు, స్థానిక సంస్థల నుంచి బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం ఆయనకు సిబ్బంది కొరత, అద్దె భవన సమస్యలపై వివరించారు.
KRNL: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిపారు.
గుమ్మలక్ష్మిపురంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని ఎస్ఎఫ్ఐ నిరసన తెలిపింది. స్థానిక పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో మండల కార్యదర్శి గంగారావు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు వేడి ఆహారం అందకపోవడంతో పాటు వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని అన్నారు.
BPT: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ గురువారం భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు సిద్ధం చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, అలాగే సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాన్ని ఎస్పీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
PLD: వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సభావత్ వెంకట్ నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాలో ఆయన భౌతిక కాయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
కృష్ణా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి చెందిన మహిళా నేతలను, కార్యకర్తలను కించపరిచేలా కథనాలను ప్రసారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ తన పత్రిక వేదికగా వైసీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.