ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వదంతులు నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ స్పష్టం చేశారు. జిల్లాలోని 211 బంకుల్లో 14.45 లక్షల లీటర్ల పెట్రోల్, 13.34 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అవసరానికి మించి ఎక్కువ కొనుగోలు చేయవద్దని కోరారు. బ్లాక్ మార్కెట్ చేస్తే బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అన్నమయ్య: రామసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెంబకూరు పంచాయతీ ఎర్రబయలుపల్లెకు చెందిన చందు (14) గుడికి హారం వేస్తూ కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించారు. ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై జరజాపుపేటలో నెల్లిమర్ల SI గణేష్ అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. యువత, విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో వివరించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే శారీరక, మానసిక సమస్యలు తలెత్తడమే కాకుండా కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.
NDL: గడిగరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా బోగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు వివిధ రకాల ద్రవ్యాలతో దాతల ఆధ్వర్యంలో మంగళ స్నానం, రుద్రాభిషేక పూజలు వైభవంగా జరిపారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు హాజరు కావాలన్నారు.
కోనసీమ: అమలాపురం మండలం వేమవరప్పాడు గ్రామంలో మానుపాటి గోవింద అనే కొబ్బరి కార్మికుడు కొబ్బరికాయలు దింపు పనిలో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టుపై కొబ్బరికాయలు దింపుతున్న సమయంలో కొబ్బరాకు అడ్డుగా ఉండటంతో దానిని తొలగించే ప్రయత్నంలో గోవింద విద్యుత్ తీగలను తాకాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
NTR: విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలోని రైస్ మిల్లును ఆర్డీవో ఏ.కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం దిగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. మిల్లులో ఏర్పాట్లు, కొనుగోలు విధానంపై వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కే.లక్ష్మీ కళ్యాణి పాల్గొన్నారు.
KRNL: ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన అవెంజర్ బైక్ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన సోమశంకర్ జరిమానా చెల్లించినప్పటికీ బైక్ ఇవ్వలేదని ఇవాళ ఆరోపించాడు. ఏడు నెలల తర్వాత స్టేషన్‌కు వెళ్లగా బైక్ మాయం అయినట్టు తెలిసి షాక్‌కు గురయ్యాడు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, ఆయన తల్లి డిమాండ్ చేశారు.
కృష్ణా: యనమలకుదురులో పి4 పథకం కింద చేపల మార్కెట్‌ను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు Y. V. B. రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. పేద వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. పి4 పథకం సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించడంలో దోహదపడుతుందన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KDP: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి పార్టీ మారడంపై వైసీపీ నాయకుడు హేమాద్రి రెడ్డి స్పందించారు. ఆదివారం వేములలో ఆయన మాట్లాడుతూ.. సతీశ్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారలేదని, కారణాలు చెప్పి మారారని తెలిపారు. భూపేశ్ రెడ్డి, ఇతర నాయకులు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ మారారని హేమాద్రి రెడ్డి ఆరోపించారు.
WG: భీమవరం జిల్లా కలెక్టరేట్లో చేసి రాహుల్ కుమార్ రెడ్డి ఆయన కార్యాలయంలో డీజిల్ పై మీడియా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లాలో అన్ని బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నామని ముఖ్యంగా రైతులకు కూపన్ విధానంలో డీజిల్ అందిస్తున్నామని అన్నారు. పోలీస్, సివిల్ సప్లై, అన్ని శాఖలు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు.
GNTR: తెనాలి గాంధీ చౌక్‌లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ASR: డుంబ్రిగూడ మండలం జోగిపుట్టు గ్రామానికి చెందిన కోర్రా బ్రుందకు ఆదివారం ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో 108అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ప్రసవం జరిగి ఆడ శిశువు జన్మించింది. తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని EMT ఏ. అప్పలనాయుడు తెలిపారు.
KDP: యువత క్రీడల్లో రాణించాలని TDP జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. కొన్ని రోజులుగా ఎర్రగుంట్ల (M) వై. కోడూరులో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో విజేతగా నిలిచిన Kcc11 టీంకు రూ.1.50 లక్షలు,రన్నరుగా నిలిచిన ఫ్రెండ్స్ 11 టీంకు రూ. 75 వేల నగదును భూపేశ్ బహుమతిగా అందించారు. నేటి ఓటమి రేపటికి గెలుపునకు నాంది అని క్రీడాకారులకు ఆయన సూచించారు.
TPT: నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వేళ సన్నిధి వీధిలో రాజకీయ ఫ్లెక్సీలు విస్తరించడం వివాదాస్పదమైంది. దర్శన మార్గంగా ఉండాల్సిన వీధి పార్టీ బ్యానర్లు, బోర్డులతో నిండిపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
KRNL: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వాసవి మాత శాంతి, సేవా భావానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.