• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెద్దాపురం పెట్రోల్ బంక్‌లో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీలు

KKD: పెద్దాపురం మండలంలోని పెట్రోల్ బంక్‌లో తహశీల్దార్ వెంకటలక్ష్మి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తహశీల్దార్ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పెద్దాపురం మండలంలోని కాండ్రకోట, పులిమేరు, వడ్లమూరు పెట్రోల్ బంకులను తహశీల్దార్ పరిశీలించారు.

April 26, 2026 / 10:26 AM IST

కన్నుమూసినా.. మరో కంటికి వెలుగై..!

W.G: మొగల్తూరుకు చెందిన అలపాటి రాజేశ్ (31) ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ, శనివారం బ్రెయిన్ డెడ్ అవడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టెడు దుఃఖంలోనూ రాజేశ్ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. తద్వారా మరికొందరికి ప్రాణభిక్ష పెట్టి రాజేశ్ ఆదర్శంగా నిలిచారు.

April 26, 2026 / 10:19 AM IST

నరసన్నపేటలో మే 9న సీఎం పర్యటన

SKLM: నరసన్నపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు మే 9న పర్యటించనున్నట్లు స్థానిక టీడీపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. జలుమూరు మండలం అక్కు రాడ గ్రామంలో నిర్వహించనున్న “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

April 26, 2026 / 10:13 AM IST

పన్ను చెల్లింపునకు నాలుగు రోజులే గడువు: కమిషనర్

KRNL: ఆస్తి పన్ను రాయితీతో చెల్లించేందుకు మరో నాలుగు రోజుల మాత్రమే గడువు మిగిలి ఉందని శనివారం కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని పన్ను చెల్లింపుదారులను కోరారు. గడువు ముగిసిన తర్వాత పూర్తి పన్నుతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

April 26, 2026 / 10:10 AM IST

శిథిలావస్థలో బ్రిటీష్ కాలం నాటి వంతెన

మన్యం: గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన నాగావళి కాలువ వంతెన ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ వంతెన మీదుగా సాంబన్నవలస, మరుపెంట, సీమలవానివలస గ్రామాల ప్రజలు, రైతులు పంట పొలాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన శిథిలావస్థ కారణంగా ఎప్పుడైనా కూలిపోతుందేమోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 26, 2026 / 10:09 AM IST

నేడు ఏడవులపర్తి గ్రామానికి శైలజానాథ్ రాక

ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ చేపట్టిన “మన గ్రామానికి మన శైలజానాథ్” కార్యక్రమం నేడు ఏడవులపర్తిలో జరగనుంది. సాయంత్రం 6:00 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో శైలజానాథ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ క్యాంపు కార్యాలయం కోరింది.

April 26, 2026 / 10:08 AM IST

సముద్రంలో మునిగిపోతున్న మహిళను కాపాడిన లైఫ్ గాడ్స్

విశాఖ: ఆర్కే బీచ్‌లో ఆదివారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సుమారు 68 ఏళ్ల వయసున్న మహిళ సముద్రంలో మునిగిపోతుండగా గుర్తించిన లైఫ్ గాడ్స్ ధనరాజ్, ఆనంద్ వెంటనే ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 26, 2026 / 10:06 AM IST

శ్రీవారి ప్రసాదం వెనుక దాగున్న సైన్స్ ఇదే.!

TPT: శ్రీవారికి పెరుగు, వెన్న, మీగడ, శొంఠి చూర్ణంతో ఇచ్చే ‘మాత్రా ప్రసాదం’ వెనుక సైన్స్ దాగుంది. ఈ ప్రసాదంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం పెరుగు తీసుకోవడంతో మనకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా, వెన్నతో వీర్యవృద్ధి ప్రాప్తి కలుగుతుందట. మీగడతో కంటిచూపు, శొంఠితో జీర్ణ వ్యవస్థ వృద్ధి, తగినంత ఉప్పుతో బీపీ కంట్రోల్ అవుతుంది.

April 26, 2026 / 10:05 AM IST

అడ్డుగా వచ్చిన పశువులు.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ASR: రాజవొమ్మంగి జాతీయ రహదారిపై శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒట్టిగెడ్డ సమీపంలో గంగవరం మండలం మర్రిపాలెంకు చెందిన రవికిశోర్‌ రెడ్డి (21), శేఖర్‌ గోపాల్‌ రెడ్డి బైక్‌పై వెళ్తుండగా పశువులు అడ్డువచ్చాయి. ఈ ఘటనలో ఇద్దరూ కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన రవికిశోర్‌ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన గోపాల్‌ రెడ్డిని అడ్డతీగల ఆసుపత్రికి తరలించారు.

April 26, 2026 / 10:01 AM IST

పత్రాలు లేని 24 వాహనాలను సీజ్

E.G: నేర రహిత సమాజానికి ప్రజలు సహకరించాలని ధవళేశ్వరం CI టి. గణేశ్ కోరారు. శనివారం సాయంత్రం ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టరేట్ వెనుక ఉన్న టిట్‌కో ఇళ్ల వద్ద పోలీసుల బృందం కార్డాన్ సెర్చ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో 400 మందిని విచారించి, 100 వాహనాలను తనిఖీ చేశారు. పత్రాలు లేని 24 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 26, 2026 / 10:00 AM IST

ఇలా అయితే వెళ్లేదెలా.. !

విజయనగరం: గొడిపాలెం-పేడాడ-బంటుపల్లి మార్గంగా భోగాపురం వెళ్లే రహదారి గుంతలతో పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

April 26, 2026 / 10:00 AM IST

డీజిల్ లేక ఖాళీగా దర్శనమిస్తున్న బంకులు

KKD: తుని నుంచి కాకినాడ వరకు జాతీయ రహదారిపై పలు పెట్రోల్ బంకులు డీజిల్ లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడంతో లారీలు, బస్సులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లినా ఇంధనం దొరకడం లేదని, వ్యవసాయ యంత్రాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు. 

April 26, 2026 / 09:44 AM IST

డిగ్రీ పరీక్షలకు 87 మంది గైర్హాజరు

KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం జరిగిన సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 578 మందికి 490 మంది విద్యా ర్థులు హాజరు కాగా, 87 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

April 26, 2026 / 09:36 AM IST

నేడు కేజీ చికెన్ ధర ఎంతంటే..?

కర్నూలు జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. వ్యాపారుల సమాచారం మేరకు స్కిన్‌తో చికెన్ కేజీ రూ.181, స్కిన్‌లెస్ చికెన్ రూ.206గా విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసం కేజీ రూ.700కు, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారులు తెలిపారు.

April 26, 2026 / 09:36 AM IST

కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు : జాయింట్ కలెక్టర్

ATP: జిల్లాలో డీజిల్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ స్పష్టం చేశారు. కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నారు. డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా చేయాలని సంబంధిత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్లకు తెలియజేశామన్నారు.

April 26, 2026 / 09:33 AM IST