KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సందర్శించారు. ప్రస్తుతం 200 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని డీసీవీ ఛైర్మన్ బాబు ఆదేశించారు.
PLD: నరసరావుపేట (M) ములకలూరులో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వల్ల రైతులకు లాభాలున్నాయని తెలిపారు. పరిశుభ్రత కోసం ప్రజలంతా చెత్తను వేరుచేసి ఇవ్వాలని ఆయన సూచించారు.
సత్యసాయి: కదిరి మండలం పట్నం గ్రామంలో విషాదం నెలకొంది. పొలం వద్ద పంట కోసం ఉంచిన యూరియా కలిపిన నీరు తాగి 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి క్రిష్ణ మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, గొర్రెలు దాహంతో బకెట్లలోని నీటిని తాగాయి. కొద్దిసేపటికే కడుపు ఉబ్బి అవి ప్రాణాలు విడిచాయి. సుమారు లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.
ATP: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 15వ తేదీ నుంచి సీసీటీవీ కెమెరా ఇన్ స్ట్రాలేషన్ కోర్సు పై ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శాంతి ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉండి టెన్త్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం 9705091727 సంప్రదించాలన్నారు.
VZM: విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వి.చందపు నాయుడు మద్దివలస కొట్టిశ రోడ్డులోని చెరువుగట్టు వద్ద ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ వైర్లు ఆవుకు తగిలి విద్యుత్ షాక్‌తో అక్కడే మృతి చెందింది.
E.G: నల్లజర్ల(M) ప్రకాశరావుపాలెం శివారు వైఎస్సార్ యూనివర్సిటీ సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
W.G: కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు ఇంఛార్జ్ కాకర్ల శ్రీను ఇంటి వద్ద గురువారం ఉదయం ఏర్పాటు చేసిన కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో వైసీపీ తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ వడ్డే రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో దుర్గ ప్రసాద్, సతీష్, శ్రీను వార్డు ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం మండలం నేకనాపురం ఎస్సీ కాలనీలో గంగమ్మ జాతర సందర్భంగా గురువారం ఉదయం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని బోనాలను మోసుకుంటూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పుల మోత, భక్తుల జైకారాలతో కాలనీ అంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మపై వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని టీడీపీ నేతలు మండిపడ్డారు. బుధవారం కొలిమిగుండ్ల టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
KRNL: ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న జిల్లాలోని అన్ని గ్రామ శాఖల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కార్యదర్శి పంపన గౌడ్ పిలుపునిచ్చారు. నందవరంలో బుధవారం మాట్లాడుతూ.. 1936 ఏప్రిల్ 11న ఆల్ ఇండియా కిసాన్ సభ స్థాపించబడిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి రైతుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కోనసీమ: యానాం అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు అధికారిక పోలింగ్ ప్రారంభం కానుంది. బూత్ ఏజెంట్లు ఉదయం 5 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
NLR: వైసీపీ మహిళా కార్యకర్తలపై ఏబీఎన్ ఆర్కే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ నీచమైన సంస్కృతికి నిరసనగా ఏబీఎన్ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు మరిచి ఆడబిడ్డలను కించపరిస్తే సహించేది లేదన్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ B.Ed, B.PEd, D.PEd సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ కావ్య జోష్ణ్న ఈ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక https://brau.edu.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చన్నారు.
CTR: రామకుప్పం (M) పాల రేవు గడ్డ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ రాత్రికి పాల రేవు గడ్డ, చెల్లిని చేను, లక్ష్మీపురం, కుప్పం (M) కంగుంది వైపు వచ్చే అవకాశం ఉండడంతో అటవీ సరిహద్దు గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది. దరఖాస్తు గడువు ఏప్రిల్ 4వ తేదీనే ముగియగా దాన్ని 9వ తేదీ వరకు పెంచినట్లు SKLM పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరావు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు polycetap.ap.gov.in వెబ్సైట్‌లో, ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న పాలీసెట్ నిర్వహిస్తారు.