కృష్ణా: సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఇక సహించబోమని వైసీపీ నేత వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో కలిసి అడిషనల్ ఎస్పీ నాయుడుకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధ ప్రచారాలను వెంటనే అరికట్టాలని వారు ఎస్పీని కోరినట్లు తెలిపారు.
కడప జిల్లాలో 2027 జనగణన సన్నాహాలు పూర్తయ్యాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు పోర్టల్, యాప్ ద్వారా ప్రజలు ‘స్వీయ గణన’ చేసుకోవచ్చన్నారు. మే 1 నుంచి 30 వరకు అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారని ఆయన చెప్పారు. ప్రజలంతా వ్యక్తిగత వివరాల గోప్యత గురించి భయపడకుండా కచ్చితమైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.
సత్యసాయి: కదిరి రూరల్ కుమ్మరమండ్లపల్లి పేలుడు ఘటనలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారికి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించి అండగా నిలిచారు.
TPT: నాగలాపురం మండలంలోని శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో మే 1 నుంచి 9 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని జేఈఓ వీరబద్రం ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు, క్యూలైన్లు, అన్నప్రసాదం వంటి ఏర్పాట్లు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
KKD: ఇంటర్ మీడియట్- 2026 పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లాలోని ఫస్ట్ ఇయర్లో 77 శాతం, సెకండ్ ఇయర్లో 81 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా విభాగం అధికారి వి. కేశవరావు పేర్కొన్నారు. కాకినాడ కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. మే 12న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ELR: నేర నియంత్రణలో సాంకేతికతను ఆయుధంగా మలుచుకోవాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలీసు సిబ్బందికి సూచించారు. బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లల గుర్తింపు, గుర్తుతెలియని మృతదేహాల ఆచూకీ కోసం ఆధునిక సాఫ్ట్వేర్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.
ATP: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్ షేక్ షమీర్‌ను అనంతపురం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఇతను తిరిగి దాడులకు తెగబడటంతో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిబంధనలు మీరినందుకు జడ్జి ఏడు రోజుల రిమాండ్ విధించడంతో నిందితుడిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
NLR: జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్ బకాయిలపై బుధవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఛైర్ పర్సన్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు కార్పొరేషన్ రూ.10 కోట్లు, కావలి 50 లక్షలు, గూడూరు, నాయుడుపేట చెరో 40 లక్షలు, ఆత్మకూరు 30 లక్షలు, వెంకటగిరి 35 లక్షలు, బుచ్చి 20 లక్షలు, అల్లూరు 7 లక్షల చొప్పున బకాయిలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ ఆదేశించారు.
CTR: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 623 పంచాయతీల్లోని 5,914 వార్డుల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్టు డీపీవో సుధాకర్ రావు పేర్కొన్నారు. అందులో పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది, ఇతరులు 27 మంది ఉన్నారని వెల్లడించారు.
PPM: పీఎం జన్ మన్లో అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ అన్నారు. బుధవారం భామిని మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అలసత్వం వహించకుండా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్, సెక్రెటరీలు పాల్గొన్నారు.
కడప జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని SP నచికేత్ హెచ్చరించారు. బైకర్లు హెల్మెట్, కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ వాడాలన్నారు. బుధవారం తనిఖీల్లో నిబంధనలు పాటించని వారిపై 226 కేసులు నమోదు చేసి, రూ.59,325ల జరిమానా విధించినట్లు వెల్లడించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని SP స్పష్టం చేశారు.
KRNL: ఈనెల 19వ తేదీన కర్నూలు స్టేడియంలోని క్రికెట్ నెట్స్‌లో అండర్-16 బాలుర విభాగంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు కర్నూలు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ బుధవారం తెలిపారు. 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన వెల్లడించారు.
కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో మహానందీశ్వర స్వామి వారి అభిషేకం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు వైదికంగా పూజలు నిర్వహించగా భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు.
NTR: విజయవాడ లయోలా కళాశాల సమీపంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఫోన్లో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పట్టు తప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: అంతర్జాతీయ పర్వతారోహకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అన్మిష్ వర్మ భూపతిరాజును కలెక్టర్ నాగరాణి బుధవారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తైన ఏడు శిఖరాలు, ఏడు అగ్నిపర్వతాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా అన్మిష్ రికార్డు సృష్టించడం గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు.