TPT: సత్యవేడు మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు చమర్తి కండ్రిగలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 10.30 గంటలకు సత్యవేడు వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు.
W.G: భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనం పూర్తయితే రోజుకు సుమారు 2 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ నాగభూషణం, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.
NDL: టీడీపీ కమిటీలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబుకు గురువారం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కలపటపు బుచ్చి రాంప్రసాద్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమితులైన విజయకుమార్, జ్యోత్స్న, రాష్ట్ర కార్యదర్శి లోహిత్ నియామకం హర్షణీయమన్నారు.
సత్యసాయి: కదిరి మహిళ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ పర్వీన్ భాను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు పర్వీన్ భాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
KDP: పులివెందులకు చెందిన యువతి పి.మన్విత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి SSC, CGLఫలితాల్లో GST ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పట్టుదలతో శ్రమించి, ఈ ఘనత సాధించడంతో పట్టణంలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం NIT కలకత్తాలో బీటెక్ పూర్తి చేశారు. బంధుమిత్రులు ఆమె నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
కడప: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై జమ్మలమడుగు పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల కాలంలో ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు, కాలనీల్లో కొందరు బహిరంగంగా మద్యం తాగడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేరానికి పాల్పడిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అర్బన్ సీఐ నరేశ్ బాబు హెచ్చరించారు.
KRNL: కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
KRNL: క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు తమకు సమాచారం ఉందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
విశాఖ: జీవీఎంసీ 63వ వార్డు, క్రాంతి నగర్ గ్రామంలో చిన్నారులు కోసం ఏర్పాటు చేసిన పార్కు చుట్టుపక్కల భవన నిర్మాణ వ్యర్ధాలు వేయడం వలన పార్కులో క్రీడలు ఆడుకునే వారికి గాయాలు అవుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పార్కు చుట్టుపక్కల రక్షణ గోడ లేకపోవడం వలన పార్కు కబ్జాకు గురవుతుందని ఆవేదన చెందుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ATP: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీము 2026-27 సంవత్సరానికి పొడిగిస్తూ జీవో MS 43 విడుదలైనట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జర్నలిస్టులు www.cfms.ap.gov.in.1,250 చెల్లిస్తే.. ప్రభుత్వం సమానంగా మరో రూ.1,250 భరిస్తుందన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ ప్రయోజనం పొందవచ్చన్నారు. ప్రీమియం చెల్లించిన వారు అవసరమైన పత్రాలను సమర్పించాలన్నారు.
E.G: ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పల్నాడు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తనపల్లి మండలం తొండపిలో భార్యాభర్తల మధ్య వివాదం కలకలం రేపింది. భార్య భూలక్ష్మిపై అనుమానం పెంచుకున్న భర్త లక్ష్మయ్య అమానుషానికి తెగబడ్డాడు. క్షణికావేశంలో కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమె కాలును నరికేశాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారిని గురువారం రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దర్శనం అనంతరం వారికి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
GNTR: టీడీపీ ప్రకటించిన విస్తృత స్థాయి పదవుల్లో గుంటూరు తూర్పు నేతలకు చోటు దక్కకపోవడం అసంతృప్తిని పెంచింది. ఎన్నో ఏళ్ల తర్వాత విజయం సాధించినా ప్రాతినిధ్యం లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, మైనారిటీ నాయకులను విస్మరించారనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే, దీనిపై పార్టీ ఎలా స్పందిస్తో చూడాలి మరీ.
PPM: చిరు ధాన్యాల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం వీరఘట్టం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ప్రకృతి వ్యవసాయం బృందం ఏర్పాటు చేసిన చిరుధాన్యాల చక్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల ప్రాంగణాల్లో చిరుధాన్యాలు సాగును చేపట్టాలని అధికారులను ఆదేశించారు.