బాపట్ల జిల్లా చీరాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan ) సోదరుడి ఆమంచి సాములు జనసేనలోకి జనసేన పార్టీ (Janasenaparty) కి చేరాాడు. అన్న ఓ పార్టీలో… తమ్ముడు మరో పార్టీలో… ఇది కదా రాజకీయం అంటే… చీరాల( Cirala) లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. సాధారణంగా ఈ సమయంలో పార్టీల్లో జంపింగ్‌లు కామనే. పార్టీ పొజిషన్, తమ సీటు, తమ శత్రువర్గం సంగతి ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని నాయకులు పార్టీలు మారిపోతుంటారు. ఆ కోవలోదే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు (Amanchi Srinivasa Rao) అలియాస్ సాములు జనసేన ఎంట్రీ. ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం వైసీపీ (YCP) లో ఉన్నారు. పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈ సమయంలో సాములు జనసేన తీర్థం పుచ్చుకోవడం ఆసక్తిగా మారింది.
ఆమంచి సాములు జనసేనలోకి రావడం వెనక పెద్ద ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. కృష్ణమోహన్ గతంలో రెండుసార్లు చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ (Congress) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నవోదయం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగు దేశంపార్టీ లో చేరి ఆపై వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019లో ఆయన వైసీపీ తరపున పోటీచేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరామ్ చేతిలో 17వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కరణం వైసీపీలోకి చేరిపోయారు. దీంతో ఆమంచికి కష్టకాలం మొదలైంది. ఇరువర్గాల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. కొట్టుకున్నారు కూడా. చీరాలలో తన పట్టు తగ్గడాన్ని ఆమంచి తట్టుకోలేకపోయారు. ఇరువర్గాల మధ్య సయోధ్యకు హైకమాండ్ ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు ఆమంచిని పర్చూరు(Parchur)కు పంపింది. అయితే ఆమంచికి మాత్రం చీరాలను వదులుకోవడం ఇష్టం లేదు. తన నియోజకవర్గంలో కరణం బలరాం బలం పెంచుకోవడాన్ని ఆమంచి తట్టుకోలేకపోయారు. తన వర్గానికి ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు.