మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. విచారణను వేగవంతం చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా వైఎస్ అవినాశ్ రెడ్డితో విచారణ అనంతరం మరికొందరికి నోటీసులు పంపుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎంవోలో అతి ముఖ్యమైన వ్యక్తికి కూడా నోటీసులు పంపడం ఏపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఇంట్లోని మనిషికి నోటీసులు అందడంతో సంచలనంగా మారింది. వివేకా హత్య కేసు మరకలు సీఎం ఇంటిని తాకినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని నోటీస్ పంపింది ఎవరికో తెలుసా? సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు.. సీఎం కుటుంబసభ్యులతో మాట్లాడితే ఆయన్ను దాటి వెళ్లాల్సిందే. ఆయన పేరు నవీన్. ఈ నవీన్ పేరు అనేది ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నవీన్ ఎవరు? సీఎం జగన్ కు ఏమవుతాడు? సీఎం కుటుంబంతో అతడికి సంబంధం ఏమిటీ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆయన గురించి వెతకడం మొదలైంది.
నవీన్ అనే వ్యక్తి కడప జిల్లాకు చెందినవాడు. నవీన్ కుటుంబసభ్యులు పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివసిస్తూ వైఎస్ రాజారెడ్డి వద్ద పని చేసేవారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత జగన్ కు నవీన్ దగ్గరయ్యాడు. 15 ఏళ్లుగా వెన్నంటే ఉంటున్నాడు. జగన్ ఎక్కడుంటే అక్కడ నవీన్ ఉంటాడు. బెంగళూరు, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో పని చేశాడు. ప్రస్తుతం జగన్ సతీమణి భారతి వద్ద పని చేస్తున్నాడు. తాడేపల్లికి జగన్ మకాం మారడంతో అక్కడే ఉంటున్నాడు. ఇంటి వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటాడు. ఈ క్రమంలోనే వివేకా హత్య అనంతరం నవీన్ కు అవినాశ్ రెడ్డి పలుసార్లు ఫోన్ చేసినట్లు కాల్ డేటాను సీబీఐ గుర్తించింది. అందుకే నవీన్ కు నోటీసులు పంపించింది. అవినాశ్, నవీన్ మధ్య జరిగిన సంభాషణ ఏమిటో ఆసక్తికరంగా మారింది.